నాడు సూపర్ హిట్ అయిన కేసీఆర్ కిట్.. నేడు ఫట్ అయ్యింది. సర్కారు దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నా ఒక్కరికీ కూడా అందడం లేదు. కిట్ల సరఫరా వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదు. దీంతో నాడు ఎంతో ఆదరణ పొందిన పథకం నేడు అటకెక్కింది. కిట్లలోని 16 వస్తువులు అందక.. డబ్బులు జమగాక.. డెలీవరి అయిన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ దవా ఖానల్లో కాంగ్రెస్ 15 నెలల పాలనలో 4,830 ప్రసవాలు జరగగా.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కిట్ అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
– నారాయణపేట, మే 26
కేసీఆర్ కిట్‌కు ఆదరణ కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిట్ అందక బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు చేయించుకున్న మహిళలు కిట్ అందక వెతలు పడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేసీఆర్ కిట్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేసింది. పుట్టబోయే శిశువు సంరక్షణ కోసం కిట్‌లో 16 రకాల వస్తువులను అందజేయడంతో కేసీఆర్ కిట్‌కు ఎంతో ఆదరణ లభించింది. ప్రభుత్వ దవాఖానలో డెలివరీ అయిన మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉండేది. దీంతో సర్కా రు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ఒక వైపు దవాఖానల్లో మెరుగైన సదుపాయాలను కల్పిస్తూనే మరో పక కేసీఆర్ కిట్‌తోపాటు ప్రోత్సాహకంగా కేసీఆర్ ప్రభుత్వం డబ్బులను అందజేసింది. మహిళలు గర్భందాల్చిన తర్వాత గ్రామా ల్లో, మున్సిపాలిటీల వార్డుల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గర్భిణులు వివరాలు సేకరించేవారు. వారి ఆధా ర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ తీసుకొని ఆన్లైన్ చేసేవారు. క్రమం తప్పకుండా ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించుకున్న మూడు చెకప్‌ల తర్వాత వారి అకౌంట్లలో రూ.3 వేలు జమ చేసేవారు. నెలలు నిండే వరకు బలవర్థకమైన ఆహారం తీసుకునేందుకు రూ.5 వే లు అందించేవారు. అదేవిధంగా ప్రసవం తర్వాత బా లింత మంచి ఆహారం తీసుకునేందుకు ఆడ శిశువు పుడితే రూ.5 వేలు, మగ శిశువు పుడితే రూ.4 వేలు ఇచ్చేవారు. వీటితోపాటు పుట్టిన బిడ్డకు క్రమం తప్పకుండా బీసీజీ, ఇతర టీకాలు వేయిస్తే, 100 రోజులకు మరో రూ.2 వేలు, ఆ తర్వాత 8వ నెల వరకు టీకాలు వేయిస్తే మిగిలిన రూ.3వేలు.. ఇలా నాలుగు విడుతలుగా కేసీఆర్‌కిట్, డబ్బులు అందేవి. ప్రసవం తర్వాత కిట్‌తో పాటు మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.13వేలు అందించేవారు. డెలివరీ తర్వాత తల్లీబిడ్డను 102 వాహనంలో తీసుకెళ్లి వారి వారి ఇండ్ల వద్ద వదిలిపెట్టేవారు. కానీ రేవంత్ పాలనలో కిట్లు బంద్ అయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి స్టాక్‌లో ఉన్న కిట్లపై కేసీఆర్ ఫొటో ఉంటే.. వాటిపై స్టికర్ అతికించి.. కేసీఆర్ కిట్ పేరుకు బదులు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) పేరుతో అందించారు. అవి అయిపోయాక కొత్త కిట్ల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పటికీ గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో గర్భిణుల నుంచి ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆశ వరర్లు సేకరించి ఆన్లైన్ చేస్తున్నప్పటికీ కిట్లు కానీ, డబ్బులు కానీ అందడం లేదు. అవేమీ ఇవ్వకుంటే బ్యాంక్ వివరాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే, సాఫ్ట్వేర్ అలాగే ఉందని ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు సమాధానమిస్తున్నారు.
నారాయణపేట జిల్లా పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో 2017 మే నుంచి 2024 జనవరి వరకు 22,408 ప్రసవాలు జరిగాయి. ఇందులో 15,494 సాధారణ, 6,914 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. మొత్తం 15,815 మం దికి కేసీఆర్ కిట్లను, అదేవిధంగా బాలింతలకు నగదును అందజేశారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు స్టాక్‌లో ఉన్న కేసీఆర్ కిట్లకు స్టిక్కర్లు అతికించి ఎంసీహెచ్ పేరుతో మార్చేసి వాటినే 2024 జనవరి వరకు అందజేశారు. ఇక అప్పటి నుంచి నేటి వరకు రేవంత్ ప్రభుత్వం ఒక్క కిట్ కూడా అందించలేదు. 2024 ఫిబ్రవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు దవాఖానలో మొత్తం 4,830 ప్రసవాలు జరిగాయి. ఇందులో 2,882 సాధారణ ప్రసవాలు, 1,948 సిజేరియన్లు చేశారు. కానీ వీరిలో ఏ ఒక్కరికీ ఎంసీహెచ్ కిట్టు కానీ, నగదు కానీ అందించిన దాఖలాల్లేవు.
నాకు బిడ్డ, కొడుకు పుట్టారు. రెండు ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలోనే జరిగాయి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాదికి రూ. 5వేలు వచ్చాయి. ఇప్పుడు బాబు పుట్టాడు. కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి రాలేదు. మా లాంటి పేదలకు ఈ డబ్బులు ఉపయోగపడుతాయని ఆశ. బాబుకు రావాల్సిన రూ.12వేలతో పాటు కేసీఆర్ కిట్ అందజేస్తే అవసరాలకు ఉపయోగపడుతాయి.
– అక్షిత, ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా
గత ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చిన కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలి. రాజకీయాల కోసం ప్రజలకు ఎంతో మేలు చేసే పథకాలను నిలిపివేయడం వల్ల ప్రజలు నష్టపోతారు. కేసీఆర్ ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన పథకాల్లో కేసీఆర్ కిట్ పథకం కూడా ఒకటి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అమలు చేయాలి.
– సానియాబేగం, నారాయణపేట జిల్లా