నారాయణపేట, జూలై 16 : నారాయణపేట జిల్లాలో చెరువులు, కుంటలు నిండితేనే పంటలకు సాగునీరు అందుతుంది. కానీ వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు కావొస్తున్నా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నా సాగునీటి వనరులైన చెరువులు, కుంట ల్లో మాత్రం ఆశించిన మేర నీరు వచ్చి చేరడం లేదు. దామరగిద్ద మండలంలో మొత్తం 72 చెరువుల ఉండగా 8 పెద్ద చెరువులు, 53 కుంటలు, 5 పర్కులేషన్ ట్యాంకులు, ఆరు ప్రైవేట్ చెరువులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక చెరువులో కనీ సం 70 శాతం నీళ్లు చేరలేదు. నారాయణపేట మండలంలో మొత్తం 189 చెరువులు ఉండగా వీటిలో 12 మైనర్ ఇరిగేషన్, 177 పంచాయతీరాజ్ చెరువులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక చెరువులో కనీసం 65 శాతం నీళ్లు చేరలేదు. ఊ టూరు మండలంలో 14 నోటిఫైడ్ చెరువులు, 23 కుంటలు ఉ న్నాయి. ఈ చెరువులకు 50 శాతం మాత్రమే నీరు వచ్చి చే రింది. ప్రస్తుతం రైతులు నారుమడులను సిద్ధం చేసుకున్నారు. మరో 15 రోజుల్లో వరి నాట్లు వేస్తారు. మాగనూరు మండలంలోని రెండు నోటిఫైడ్ చెరువులు, 63 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటిలో కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే వర్షపు నీరు చేరింది. మండలంలో ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే వరి సాగుకు సిద్ధమవుతున్నారు. కృష్ణ మండలంలో రెండు నోటిఫైడ్ చెరువులు, 44 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. 40 శాతం వరకు వర్షపు నీరుతో నిండినవి.
మక్తల్ మండలంలో 11 నోటిఫైడ్ చెరువులు, 86 చిన్న చెరువులు, కుంటలు, 29 చెక్ డ్యాంలు ఉన్నాయి. ప్రస్తుతం చిన్న చెరువులు, కుంటలు 50శాతం వర్షపు నీటితో నిండినవి. మరికల్ మండలంలో 14 చిన్న, 6 పెద్ద చెరువులుండగా.. ఏదీ నిండలేదు. కన్మనూర్, తీలేరు, చిత్తనూరు, మాధ్వార్ చెరువుల కింద నాట్లు వేస్తున్నారు. అ దేవిధంగా కోయిల్‌సాగర్ పరీవాహక ప్రాంతంలో రైతులు నాట్లు వేస్తున్నారు. ధన్వాడ మండలంలో తొమ్మిది పెద్ద చెరువులు ఉన్నాయి. 10కుంటలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో బోర్ల కింద నాట్లువేస్తున్నారు. గున్ముక్ల చెరువులో మాత్రం కొంత నీరు వచ్చింది. మిగతా చెరువుల్లో నీరు చేరలేదు. ధ న్వాడ పెద్ద చెరువులో కొంచెం నీరు వచ్చి చేరింది. మద్దూరు మండలంలో 46చిన్న చెరువులు, 12పెద్ద చెరువులు ఉ న్నాయి. రెండు చిన్న చెరువులు, రెండు పెద్ద చెరువుల్లో 25 శాతం నీరు చేరింది. కోస్గి మండలంలో 69 చిన్న, ఏడు పెద్ద చెరువులు, మూడు కత్వలు ఉన్నాయి. వీటిల్లో 25 శాతం మాత్రమే నీళ్లు ఉన్నాయి. గుండుమాల్ మండలంలో 42 చి న్న, నాలుగు పెద్ద చెరువులు, మూడు కత్వలు ఉన్నాయి. వీటిల్లో 15 శాతం మాత్రమే నీరు చేరింది, కొత్తపల్లి మండలంలో 33 చిన్న, ఆరు పెద్ద చెరువులు ఉండగా ఇక్కడ కూడా 20 శాతం కూడా నీరు చేరలేదు.
ఈ ఏడాది 4.20 లక్షల ఎకరాల్లో పంటలు పండించనున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా. ప్రధానంగా మ క్తల్, నర్వ, మరికల్ మండలాల్లో భీమా, సంగంబండ, భూత్పూర్, కోయిల్‌సాగర్, ఎత్తిపోతల ప్రాజెక్టు ఆయకట్టు రైతు లు వానకాలం వరి పంట సాగుకు సిద్ధమవుతున్నారు. మిగిలిన మండలాల్లో చెరువులు, కుంటలు బోరుబావులే ఆధారంగా వరి పండిస్తున్నారు. పలు మండలాల్లో ఇప్పటికే కొం తమంది నారుమడులు సిద్ధం చేసుకొని రేపోమాపో వరినా ట్లు నాటేందుకు సిద్ధమవుతుండగా.. మరి కొందరు మాత్రం ఇప్పటికే నాట్లు వేశారు. పత్తి, కంది, పెసర, కుసుమ విత్తనాలు నాటగా మొలకెత్తాయి. వర్షాలు లేకపోవడంతో నాటి న విత్తనాలు ఎలా అనే సందిగ్ధ పరిస్థితి నెలకొన్న సమయంలో అడపాదడపా కురిసిన వర్షాలతో అన్నదాతల్లో ఆశ లు చిగురించాయి. ఒక దశలో అసలు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయా లేదా అనే బెంగతో రైతులు వరుణ దేవుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొన్నిచోట్ల అయితే రైతులు తమతమ గ్రామాల్లో ప్రత్యేకంగా భజనలు చేస్తూ ఆలయాలకు వెళ్లి టెంకాయలు కొట్టి వరుణదేవుడు క రుణించే విధంగా చూడాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో జూన్‌లో 129.5 మిల్లీమీటర్ల వర్షపాతం న మోదు కావాల్సి ఉండగా.. 80.9 మి.మీ. వర్షపాతమే నమో దైంది. అంటే 62.47 శాతం మాత్రమే వర్షాపాతం కురిసినట్లు చెప్పవచ్చు. ఇక జూలైలో 15 రోజుల్లో 141.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ప్రస్తుత జూలై మాసం లో కేవలం 48.30 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే న మోదైనట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది అంతంత మాత్రమే వానలు కురుస్తున్నాయి. బోరు బావిలో నీరు సరిగ్గా లేకపోవడంతో పదెకరాలకు బదులు రెండు ఎకరాల్లో వరి సాగు చేసేందుకు కరిగెట చేసుకుంటున్నా రెండు మూడు పెద్ద వర్షాలు పడితే తప్పా చెరువులు, కుంటలు నిండే పరిస్థితి లేదు. పంట పండి చేతికి వచ్చేదాక భరోసా లేదు. పెట్టుబడులకు అప్పులు చేసినా దేవుని మీద భారం వేసి వరి సాగు చేస్తున్నా..