పెద్ద ధన్వాడలో ఏరువాక పండుగ ఘనంగా జరిగింది. ఇండ్లకు మామిడి తోరణాలు పండుగ వాతావరణాన్ని తీసుకురాగా.. లోగిళ్లలో రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. తుంగభద్ర నదిలో కాడెద్దులకు స్నానం చేయించి.. వాటిని రైతులు అందంగా అలంకరించారు. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించారు. పిండి వంటలు చేసి.. ఇంటిల్లిపాది విందు భోజనాలు ఆరగించారు. జైలు నుంచి 12 మంది రైతులు విడుదల కావడంతో 9 రోజుల తర్వాత గ్రామప్రజలు, రైతులు సంబురంగా పండుగలో భాగస్వాములయ్యారు.
– అయిజ/అలంపూర్, జూన్ 19
అయిజ/అలంపూర్, జూన్ 19 : రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో గురువారం ఏరువాక పండుగను ప్రజలు, రైతులు సంబురంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా రైతులు తుంగభద్ర నదిలో కాడెద్దులకు స్నానం చేయించి, కొమ్ములకు రంగులు వేసి ముస్తాబు చేశారు. తెల్లవారు జాము నుంచి ఇండ్ల ముంగిట కల్లాపు చల్లి, ముగ్గులు వే సి, పిండివంటలు చేసుకొని పిల్లా పాపలతో గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నా రు. గతేడాది నుంచి గ్రామ సమీపంలో ఇ థనాల్ ఫ్యాక్టరీ ఏ ర్పాటును వ్యతిరేకి స్తూ శాంతియుతం గా నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.
దాదాపు 12 గ్రామాల ప్రజ లు, రైతులు మూకుమ్మడిగా నిరసనలు చేపడుతున్నారు. అయినా ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమా న్యం పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఈ నెల 4న బౌన్సర్లు, పోలీసులతో యాజమాన్యం రైతులపై దాడులు చేయగా, రైతులు ఫ్యాక్టరీకి చెందిన కంటైనర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేసి, 12మందిని అరెస్టు చేసి, పాలమూరు జైలుకు తరలించారు. 15 రోజులుగా ఆవేదనతో ఉన్న రైతులు, గ్రా మస్తులు అక్రమ కేసులో జైలుకు వెళ్లిన తమవారు బుధవారం రాత్రి ఇండ్లకు చేరుకోవడంతో సంతోషంతో ఏరువాక పండుగను జరుపుకొన్నారు.
నడిగడ్డలో మొట్ట మొదటిగా వచ్చే పండుగ ఏరువాక. ప్రతి ఏటా ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు ఏరువాక పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. కానీ పెద్ద ధన్వాడ రైతులు జైలుకు వెళ్లడంతో ఈ నెల 11న జరుపుకోవాల్సిన ఏరువాక పండుగను గ్రామస్తులు జరుపుకోలేదు. పండుగ రోజు గ్రామం బోసిపోయింది. గ్రామ దేవతల ఆలయాలకు రైతులు, ప్రజలు చేరుకోక పోవడంతో మూతపడ్డాయి. జైళ్లకు వెళ్లిన తమవారు ఇండ్లకు చేరుకున్నాకే ఏరువాక జరుపుకొంటామని గ్రామస్తులు తీర్మానించుకున్నారు. శుక్రవారం రైతుల కళ్లలో కొంత మేరకు సంతోషం కలగడంతో పండుగను జరుపుకోవాలని బుధవారం రాత్రి చాటింపు చేసి, గురువారం పండగను జరుపుకొన్నారు. కాడెద్దులను ముస్తాబు చేయడం, వ్యవసాయ పనిముట్లను సరి చేసుకోవడం, గ్రామ దేవతలు సుంకులమ్మ, సవారమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పండుగను పురస్కరించుకొని గ్రామస్తులు ఇండ్లలో పిండి వంటలు చేసుకొని పిల్లా పాపలతో విందు భోజనం ఆరగించారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటన నేపథ్యంలో గత 15 రోజులుగా గ్రామంలోని ప్రజలు, రైతులు ఆందోళనలోనే ఉన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదుతో 40మందిపై కేసులు నమోదుకాగా, 12 మందిని 14 రోజులు రిమాండ్కు తరలించారు. బుధవారం కోర్టు 12 మందికి బెయిల్ మంజూరు చేయడంతో ఇండ్లకు చేరుకున్నారు. జైలు నుంచి 12మంది ఇండ్లకు వచ్చారనే ఒక వైపు సంతోషం ఉన్నప్పటికీ, మరో వైపు 28మందిని ఎప్పుడు తీసుకెళ్తారోనని ఆందోళనతో గ్రామస్తులు ఉన్నారు. ఏరువాక పండుగ జరుపుకొంటున్నా.. వారిలో సంతోషం కనిపించలేదు. అంతేకాకుండా రైతులకు కోర్టు కండీషన్ బెయిల్ మంజూరు చేయడంతో వారిలో ఆనందం కనించలేదు.