జడ్చర్లటౌన్, జూలై 6 : ప్రతి ఒక్కరూ నా ఓటు.. నా హక్కు భావనతో సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా సోమవారం జడ్చర్లలో మాజీ మంత్రికి ఎన్యూమరేషన్ పత్రాన్ని డిప్యూటీ ఎలక్షన్ తాసీల్దార్ మహబూబ్అలీ, బీఎల్వో సునీత అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సర్ ప్రక్రియ విధానాన్ని గురించి బీఎల్వోను అడిగి తెలుసుకున్నారు. ప్రతిఇంటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చాలని బీఎల్వోను సూచించారు.
ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతగా వ్యవహరిం చాలని సూచించారు. బలమైన ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు విలువైనదేనని చెప్పారు. ప్రజాస్వామ్యంలో బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా అత్యంత అవసరమని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం, వివరాలు సరిచేసుకోవడం, కొత్త ఓటర్లను చేర్చడం అందరి బాధ్యత అని సూచించారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.