హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగుల కన్నీళ్లు తుడుస్తాం. అధికారం చేపట్టిన మొదటి సంవత్సరమే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం. వివాదాస్పద జీవో నంబర్ 46ను బంగాళాఖాతంలో వేస్తాం’ అంటూ నాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మడమ తిప్పారని గ్రామీణ యువత మండిపడుతున్నారు. జీవో 46 రద్దుపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టిన సీఎం.. నాడు ఇచ్చిన హామీలు బూటకం అని తేల్చారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఇచ్చిన 7,437 పోలీసు కొలువుల్లో 1,380 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులను జీవో 46 నిబంధనలకు అనుగుణంగానే భర్తీ చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో మరోసారి తమకు గోస తప్పదని గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు నిరుత్సాహపడుతున్నారు. అధికారం రాకముందు ఒకలా.. అధికారం వచ్చాక మరొకలా మాటతప్పి, నిరుద్యోగులను మోసగించిన ముఖ్యమంత్రిని రేవంత్‌రెడ్డినే చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జీవో 46 కారణంగా అత్యధికంగా మా ర్కులు వచ్చినా.. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను పొందలేకపోయిన వేలాదిమంది నిరుద్యోగులు.. దానిని రద్దు చేయాలని తీవ్రంగా పోరాడారు. అది ఎన్నికల సమయం కావడంతో.. నాటి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఆ అంశాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నా రు. జీవో 46ను రద్దు చేస్తామని, అందుకో సం నిరుద్యోగులు తమను గెలిపించాలని అభ్యర్థించారు. తీరా గెలిచిన తరువాత దాని ని రద్దు చేయకపోవడంతో నిరుద్యోగులు, నష్టపోయిన అభ్యర్థులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. 2024 ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అప్పటి ఏజీ సుదర్శన్‌రెడ్డి, అదనపు ఏజీ రంజిత్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితర అధికారులతో హైపవర్ కమిటీగా రివ్యూ చేశారు. దానిని రద్దు చేస్తున్నామని అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ ఆ జీవో రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత దాని రద్దుకోసం క్యాబినెట్ సబ్‌కమిటీ వేసినా.. అందులో సభ్యులెవరో? వారు ఎన్నిసార్లు సమావేశమయ్యారో తెలియదు. దీంతో అవన్నీ తూతూ మంత్రపు చర్యలేనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్న సమయంలో.. దానినే నిజం చేస్తూ ప్రభుత్వం తాజా నోటిఫికేషన్లో జీవో 46ను ప్రస్తావించింది.
పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో కానిస్టేబుల్‌కు అర్హత వయస్సును కనీసం 36 ఏండ్లకు, ఎస్సై అభ్యర్థులకు 40 ఏండ్లకు పెంచాలని గత రెండున్నరేండ్లుగా నిరుద్యోగులు పోరాడుతున్నారు. గత రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పోలీసు కొలువుకూ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో తమ వయసు పెరిగిందని అందుకే వయోపరిమితిని సడలించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, డీజీపీలకు సైతం వినతిపత్రాలు ఇచ్చారు. సీఎంగా రేవంత్‌రెడ్డి అవేమీ పట్టించుకోకపోవడంతో నిరుద్యోగులు కన్నీంటి పర్యంతమవుతున్నారు.
జీవో నం.46 తెలంగాణ పోలీసు నియామకాల్లో అత్యంత వివాదాస్పద ఉత్తర్వుల్లో ఒకటిగా నిలిచింది. ఈ జీవో ద్వారా తెలంగాణ పోలీసు నియామకాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులను జిల్లా లేదా జోన్ల వారీగా కాకుండా కొత్తగా నిర్ణయించిన స్థానిక క్యాడర్ల ప్రకారం కేటాయించే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మార్పు వల్ల ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు పెద్ద సంఖ్యలో పోస్టులు స్థానిక క్యాడర్లకు కేటాయించబడ్డాయి. దీంతో మిగిలిన తెలంగాణ జిల్లాల అభ్యర్థులకు అవకాశాలు గణనీయంగా తగ్గాయనేది వాదన. 2016, 2018 నియామకాల నోటిఫికేషన్లు రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా ఉంటే.. జీవో 46 వల్ల స్థానిక క్యాడర్ పరిమితులు పెరిగాయని నిరుద్యోగులు చెప్తున్నారు. గ్రామీణ జిల్లాల యువత ఎకువగా కానిస్టేబుల్ ఉద్యోగాలపై ఆధారపడుతుండగా, కొత్త విధానం వారి పోటీ అవకాశాలను తగ్గించిందని అంటున్నారు. దీనిపై పునరాలోచించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు రాబోయే నియామకాల్లో ఆ జీవోను రద్దు చేస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు. నిరుద్యోగుల పక్షాన ఆ జీవో రద్దు కోసం పోరాడారు.