హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ) : తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవమానించడం.. ఆయన అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం అనుచిత వ్యాఖ్యలపై గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ యువత ప్రతిభను కించపరిచేలా మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా?, ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యారా?, లేదా ఏదైనా వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం ఉన్నదా? అంటూ ప్రశ్నలు సంధించారు.
ప్రజలు రేవంత్‌రెడ్డి గతాన్ని మరచిపోలేదని.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మొదలైన ఆయన ప్రయాణం బ్లాక్ మెయిల్ రాజకీయాల వరకు వెళ్లిందంటూ విమర్శించారు. దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, దేశానికి సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను అందిస్తున్న తెలంగాణ యువతను అవమానించడం అత్యంత దురదృష్టకరమని కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ యువత కృషి, ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుండగా, వారిని కించపరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చదువుకున్నోడికి చదువు విలువ తెలుస్తుంది : మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డిని తెలంగాణ సీఎం చేసుకోవడమే రాష్ట్రానికి పెద్ద క్రిమినల్ వేస్ట్ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చదువుకొన్నేడికే చదువు విలువ తెలుస్తుందని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే మూర్ఖపు ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటూ చేసిన సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ జెన్‌జీ యువత కూడా ఢిల్లీ వాళ్లకు తగ్గకుండా మాట్లాడుతున్నారని, ఇదీ కేసీఆర్ కట్టించిన వెయ్యి గురుకులాల పుణ్యమేనని వ్యాఖ్యానించారు.

గురుకులాల్లో చదివిన పిల్లలు ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను అధిరోహించారని, అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డారని గుర్తుచేశారు. 200 మంది గురుకుల పిల్లలను చంపిన ఘనుడని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకే విద్యాశాఖ నిర్వహణ సాధ్యమని తోటి మంత్రులను అవమానపరుస్తున్నారని విమర్శించారు. గురుకులంలోని ఒక చిన్నారి అనారోగ్యంతో మరణించడాన్ని చూసి కలత చెందిన కేసీఆర్ ప్రతి స్కూల్‌కూ ఒక నర్సును నియమించారని వివరించారు. ఎమ్మెల్యేల పోటీ వయస్సును 25 నుంచి 21 తగ్గించాలని ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డి.. బీసీ బిల్లు తరహాలోనే యువకులను మోసం చేస్తారని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్‌గాంధీతో చెప్పించాలని డిమాండ్ చేశారు. కేశవరావు, జైపాల్రెడ్డిలే తెలంగాణలో ఇద్దరు మేధావులని కీర్తిస్తున్న రేవంత్‌రెడ్డి మిగతా వారిని విస్మరించడం దురదృష్టకరమని మండిపడ్డారు.
హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ): బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల ఆత్మగౌరవాన్ని, ఆత్మ ైస్థెర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నో ప్రపంచ వేదికలు, అమెరికా-యూరప్ దేశాల్లోని మరెన్నో అగ్రగామి సంస్థల్లో అత్యున్నత పదవుల్లో రాణిస్తూ ఎందరో యువ ఇంజినీర్లు మన దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.

అలాంటి విద్యార్థుల శ్రమను, మేధస్సును కించపరిచే హకు సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరిచ్చారని కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ మేరకు తక్షణమే ఇంజినీరింగ్ విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల తరఫున పోరాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమైనవని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాజానికి దిశానిర్దేశం చేయాల్సింది పోయి, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సిగ్గుచేటని ఆయన గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ ఇంజినీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ ప్రకటనలో గుర్తుచేశారు. నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల కల్పన వంటి అనేక అంశాలపై దృష్టిపెట్టాల్సిన ముఖ్యమంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యతను విస్మరించి విద్యార్థులనే తప్పుబట్టడం ముఖ్యమంత్రి పదవి హుందాతనానికి తగదని హితవు పలికారు.