నారాయణపేటరూరల్, అక్టోబర్ 29 : పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ వృద్ధులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన బుధవారం మండలంలోని జాజాపూర్‌లో చోటు చేసుకున్నది. పంచాయతీ కార్యదర్శి సుమలత గ్రామంలో మం గళవారం నుంచి పింఛన్ల పంపిణీ చేస్తున్నది. అయితే బుధవారం కూడా పంపిణీ చేస్తున్న క్రమంలో ఫోన్ కిందపడి పనిచేయకపోవడంతో పంపిణీ ప్రక్రియ నిలిచి పోయింది.
దీంతో ఆగ్రహించిన వృద్ధులు వెంటనే రోడ్డుపైకి వచ్చిన నిరసనకు దిగారు. పంచాయతీ కార్యదర్శి అక్కడికి వచ్చి ఫోన్ పనిచేయక పింఛన్లు పంపిణీ నిలిచిపోయిందని త్వరలోనే అందరికీ పింఛన్లు పంపిణీ చేస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. దీనిపై పోస్ట ర్ ఐపీవో జుబేర్‌ను వివరణ కోరగా జాజాపూర్‌లో పింఛన్ల పంపిణీ సమయంలో ఫోన్ కింద పడటంతో ఫొటో క్యాప్చర్ తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడిందని, అందుకే పంపిణీని నిలిపివేశారని, నేడో రెపో వేరే ఫోన్‌ను సర్దుబాటు చేసి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.