నాగర్‌కర్నూల్, నవంబర్ 16 : కోడిగుడ్డు ధర కొండెక్కింది. రోజురోజుకూ ఎగ్ ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానూ రిటైల్ ఒక్క గుడ్డు ధర రూ.7లకు చేరింది. వారంగా రోజుకు రూ.20 పైసల నుంచి రూ.30 పైసల చొప్పున ధర పెరుగుతూ వచ్చింది. ఆదివారం ధరలను చూస్తే వంద గుడ్లకు రూ.615 పలుకుతున్నది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లోనూ, కిరాణ దుకాణాల్లో గుడ్డును రూ.7లకు అమ్మాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక మాసంలో గుడ్డు వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ ధర పెరగడం పరిపాటిగా మారిందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉండడంతో మంచి ధర పలుకుతుందని ఫామ్ రైతులు, హోల్‌సేల్ దుకాణాదారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు గతంలో గుడ్ల పిల్లల ఉత్పత్తి తక్కువగా ఉండడం, చాలా వరకు కోడి పిల్లలు వివిధ రోగాల బారిన పడి మృతి చెందడంతో గుడ్లు పెట్టే కోళ్లు తక్కువగా ఉండడంతో దిగుబడి తగ్గిందని తెలుస్తోంది. దీంతో హోల్‌సెల్ ధరనే గుడ్డుకు రూ.6.20లకు పెరగవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. పెరిగిన ధరలతో గుడ్లను తినేదానికంటే చికెన్ తినడం మంచిదని జనం పేర్కొంటున్నారు.
చికెన్ ధరలు తగ్గినప్పటికీ గుడ్ల ధరలు మాత్రం ఎగబాకుతున్నాయి. గతంకంటే చికెన్ ధర కిలో రూ.25 నుంచి రూ.40 వరకు తగ్గింది. ఈ ఏడాది చాలా వరకు బాయిలర్ కోళ్లు బర్డ్ఫ్లూతోపాటు వివిధ రోగాల బారిన పడి వేలాదిగా చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో చాలా వరకు ఫామ్ రైతులు గుడ్లు పెట్టే పిల్లలను కానీ, బాయిలర్ పిల్లలను కానీ ఫామ్‌లో పెంచేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో గతంలో చికెన్ ధరలు పెరగగా, ప్రస్తుతం గుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా మంది రైతులు బర్డ్‌ఫ్లూ రోగం పూర్తిగా నయమయ్యాకే పిల్లలను తెచ్చి పెంచడం ప్రారంభించారు.
దీంతో పిల్లలు పెరిగి పెద్దయి గుడ్లు పెట్టేందుకు సమయం పడుతున్నది. ఈ తరుణంలో ఉన్న కోళ్ల ద్వారా వస్తున్న గుడ్లు తక్కువగా ఉండడంతో డిమాండ్ ఏర్పడి ధర పెరిగిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చలికాలం ప్రారంభం కావడంతో గుడ్డు వినియోగం సైతం ఎక్కువవడంతో ఉన్న వాటికే మంచిరేటు వస్తుందని ఫామ్రైతులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు పేర్కొంటున్నా.. కొనుగోలు చేసి తినే ప్రజలు మాత్రం వామ్మో గుడ్డు ఏడు రూపాయలా? అని నోళ్లు వెళ్లబెడుతున్నారు.