బిజినేపల్లి, మే 14 : మండలంలోని అల్లీపూర్ గ్రామానికి సరఫరా అయ్యే మిషన్ భగీరథ తాగునీటిలో కోకొల్లలుగా వానపాములు దర్శనమిస్తున్నాయి. కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేశారు. గతంలో మిషన్ భగీరథ నీరు గ్రామా లు, తండాల్లో ప్రతినిత్యం తాగడానికి ఉపయోగించేవారు.
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ వ్యవస్థను పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. మండలంలోని అల్లీపూర్ గ్రామంలో మూడు రోజులుగా ఇంటింటికీ వచ్చే మిషన్‌భగీరథ నీటి నుంచి వానపాములు రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపానపోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీంతో భగీరథ నీటిని కేవలం వాడుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక మండలంలోని వెల్గొండ గ్రామంలోనూ మిషన్ భగీరథ నీటి సరఫరా విషయంలో సర్పంచ్ నాగిరెడ్డి గతంలో పలుమార్లు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినా నేటికీ పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరాలో స్పందించి స్వచ్ఛమైన నీటిని అందించాలని స్థానికులు కోరుతున్నారు.