నారాయణపేట, ఆగస్టు 31 : వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నట్లు నెల రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో నమోదవుతున్న రోగుల సంఖ్యను బట్టి చూస్తే అర్థమవుతున్నది. నెలరోజులుగా 152 డెంగ్యూ, 190 మలేరియా కేసుల నమోదు కావడం చూస్తుంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తున్నది.
అధికారులు సైతం పారిశుధ్యం విషయంలో ఉదాసీనత వైఖరి అవలంభిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కారులో ప్రతి గ్రామ పంచాయతీలో చెత్తను తొలగించేందుకు ఇచ్చిన ట్రాక్టర్లను సైతం నేడు నిధులులేమి కారణంగా మూలన పడేశారు. చాలా వరకు గ్రామాల్లో అధికారులు తమ జేబుల నుంచి ఖర్చు చేసినా ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో మందులు అందుబాటులో లేవు. డెంగీ, మలేరియాతోపాటు ఇతర రోగాలకు సంబంధించిన పరీక్ష కిట్లు కూడా లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నారాయణపేట జిల్లాలో ఒక్కో పీహెచ్సీ సెంటర్లో రోజుకు 100 నుంచి 300మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని దవాఖానలో కేసీఆర్ సర్కారు అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ప్రస్తుతం రోగులకు అరకొర వైద్యం అందుతున్నది. వైద్యుల కొరతతో 89 ఖాళీలు ఉన్నాయి. కేవలం 28 మంది వైద్యులతో నెట్టుకొస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో డాక్టర్లు అందుబాటులో లేక జూనియర్ డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నారు. మందులు కూడా అందుబాటులో లేవు. రక్త పరీక్షల రిపోర్టులు సైతం ఆలస్యంగా వస్తున్నాయి. సరైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులపై అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారు.