మహబూబ్నగర్, ఆగస్టు 13 : ప్రభుత్వ దవాఖానలపై ప్రభుత్వ పర్యవేక్షణ కరువైంది. దీంతో డాక్టర్లు ఉండరు.. అందుబాటులో మందులు లేవన్నట్లు పరిస్థితి తయారైంది. రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన పేరొందింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రోగులకు అన్ని రకాలు సేవలు ఇక్కడ అందేవి.
కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారైంది. రోగుల నాడి పట్టి చూసే డాక్టర్లే కరువయ్యారని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 150 మంది డాక్టర్లు, హౌస్ సర్జన్లు 100 మందితోపాటు 250 మంది నర్సింగ్, 150 మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర రోగులతోపాటు నిత్యం పెద్దఎత్తున తరలివస్తుంటారు. వార్డులో డాక్టర్లు అందుబాటులో లేకుండా పేషెంట్ పరిస్థితి తెలుసుకొని జూనియర్ డాక్టర్లకు ఫోన్లో సూచనలు అందిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు, గుండె, నరాల డాక్టర్లు లేకపోవడంతో హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ దవాఖానలకు వెళ్లాల్సిందే. ప్రధానంగా రోగులకు వీల్ చైర్లు, స్ట్రెచర్లు లేక రోగులు, వారి వెంట వచ్చే సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీల్చైర్లను వార్డు బాయ్స్ మందు లు తీసుకురావడానికి, నీటిని తెచ్చేందుకు వినియోగిస్తున్నారే తప్పా రోగుల కోసం వాడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ఆయా పీహెచ్సీల్లో మెరుగైన వైద్యం అందక ఈ దవాఖానను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోగుల సంఖ్య పెరుగుతున్నది. నిత్యం ఎక్కువ మంది రోగులు వస్తుండడంతో వైద్యులు హడావుడిగా చికిత్స చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని రోగులు వాపోతున్నారు. దీనికి తోడు ఫార్మసీలో మందుల కొరత ఏర్పడింది.
ఆరునెలలుగా మెడ నొప్పులు ఉన్నాయని పెద్దాసుపత్రికి వస్తే పరీక్షించిన వైద్యులు మందులు రాశారని పాలమూరుకు చెందిన శాంతమ్మ తెలిపింది. అయితే దవాఖానలో మందులు తీసుకునేందుకు వెళ్తే నొప్పుల గోలీలు లేవని బయట తీసుకోవాలని ఫార్మసిస్టులు ఉచిత సలహా ఇచ్చారని వాపోయింది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని మందులు అందుబాటులో ఉంచడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.