గద్వాల, సెప్టెంబర్ 9 : విద్యార్థులకు సైతం నీటి కష్టాలు తప్పడం లేదు. తల్లిదండ్రులు లేని వారు, బాలకార్మికులు, చదువు మధ్యలో మానేసిన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా మార్చేందు కోసం జమ్మిచేడ్ సమీపంలో నిర్వహిస్తున్న అర్బన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్య వేధిస్తున్నది. 4 నుంచి 8వ తరగతి వరకు ఇక్కడ 120 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో నీటి అవసరాల కోసం వారు పడరాని పాట్లుపడుతున్నారు. సమస్యను పరిష్కరిస్తామన్న అధికారులు పత్తా లేకుండాపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాఠశాల ఆవరణలోని బోరు మోటర్ 20 రోజుల కిందట చెడిపోగా వార్డెన్ మరమ్మతులు చేయించారు. తర్వాత మళ్లీ రెండ్రోజులకే రిపేర్కు వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. జిల్లా ఇన్చార్జి విద్యాధికారి రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి.. నీటి సమస్యను తీరుస్తామని హామీ ఇ చ్చి వెళ్లినా నేటికీ మరమ్మతులు మాత్రం చేయలేదు. దీంతో పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఉదయం నిద్ర లేవగానే సమీపంలో ప్రైవేట్ బోరును ఆశ్రయిస్తున్నా రు. అక్కడ నుంచి బకెట్ల ద్వారా నీటిని పట్టుకొచ్చి స్నానాలు చేస్తున్నారు. ఇందుకోసం ముందు వెళ్లిన విద్యార్థులు బకెట్లతో వరుసగా నిలబడుతున్నారు.
పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉండగా వీరందరికీ కలిపి పాఠశాల లోపల రెండు బాత్రూం లు మాత్రమే ఉన్నాయి. ఇవి విద్యార్థులకు ఏ మూల కూ సరిపోవడం లేదు. దీంతో చేసేది లేక అందరూ ఆరుబయట స్నానాలు చేయడంతోపాటు బట్టలు ఉ తుక్కుంటున్నారు. ఒకటికి, రెంటికీ ఆరు బయటకే వెళ్తున్నారు.
ప్రహరీ లేకపోవడంతో రాత్రిళ్లు విషసర్పాలు, పగ టి పూట పందులు సంచరిస్తున్నాయి.
పాఠశాలలో 15 రోజులుగా నీటి ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారని విద్యార్థులతోపాటు అక్కడి వార్డె న్, విద్యాధికారి, అదనపు కలెక్టర్, కలెక్టర్ దృష్టికి తీ సుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు. జిల్లా ఇన్చార్జి విద్యాధికారి పాఠశాలను సందర్శించి సమస్యలు తె లుసుకొని వాటిని ఇప్పటి వరకు పరిష్కరించకపోవడంతో విద్యార్థులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. వెంటనే సమస్యలు పరిష్కరించి నీటి కొరత తీర్చడంతోపాటు ప్రహరీ, కిచెన్షెడ్ ఏర్పాటు, టాయిలెట్స్ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.