Amarachinta | అమరచింత, మార్చి 23 : ఎండలు ముదరకముందే.. అమరచింతలో తాగునీటి తండ్లాట మొదలైంది. గుక్కెడు నీళ్ల కోసం.. రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. గత నాలుగు రోజుల నుంచి పట్టణంలోని రాంనగర్ కాలనీకి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ.. ఖాళీ బిందెలతో రోడ్డుపై చేరుకుని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న ఒకటో వార్డు రాంనగర్ కాలనీలో గత నాలుగు రోజుల నుంచి తాగునీటి సరఫరా లేక ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్, వార్డు ఆఫీసర్‌తో పాటు మున్సిపల్ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక.. ఖాళీ బిందెలతో నిరసన చేయాల్సి వచ్చిందన్నారు.
అమరచింత ప్రధాన రహదారి రాజీవ్ గాంధీ చౌరస్తాలో రోడ్డుపై మహిళలు, చిన్నారులు ఖాళీ బిందెలతో బైఠాయించారు. మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చి తాగునీరు సరఫరా చేసేంతవరకు ఆందోళన విరమించేది లేదని కాలనీవాసులు తేల్చిచెబుతున్నారు. అరగంట నుంచి రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాజీవ్ గాంధీ చౌరస్తా వద్దకు పోలీసులు చేరుకున్నారు. తాగునీటి కోసం ఆందోళన చేపట్టిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.