దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), ఏప్రిల్ 21 : మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో గత నెలలుగా తాగునీటి కటకట ఏర్పడింది. అధికారులు మిషన్ భగీరథ నీటి సరఫరాను పట్టించుకోక పోవటంతో గ్రామంలోని 9, 10వ వార్డులో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆ రెండు వార్డుల ప్రజలు తాగునీటి కోసం నానా గోసలు పడుతున్నారు.
పనులు మానుకుని సమీపంలోని వ్యవసాయ బోర్ల దగ్గర నుంచి బిందెలతో నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మండల, జిల్లా కేంద్రాల్లో ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.