నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా బీఆర్ఎస్ సర్కార్ పరిపాలన సాగిస్తున్నదది. రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికలే కీలకం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం ప్రస్తావించారు. అలాంటి అంబేద్కర్‌ను చూపించి కాంగ్రెస్, బీజేపీవంటి పార్టీలు ఓట్లతో అధికారం దక్కించుకోవడం పరిపాటిగా వస్తున్నది. మతోన్మాద పార్టీలు సైతం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేయడం, మారుస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అంబేద్కర్‌పై కేవలం మాటలతోనే కాకుండా చేతలతోనూ తన చిత్తశుద్ధిని చాటుకొంటున్నారు.
అంబేద్కర్ స్ఫూర్తిగా దళితులు, బీసీలు, మైనార్టీల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. దేశంలోనే ఆధునికంగా, అత్యున్నత స్థాయి లో నిర్మిస్తున్న సచివాలయానికి అం బేద్కర్ పేరును పెట్టడం విశేషం. అంతేకాకుండా హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్ ఎదురుగా, ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన 11 ఎకరాల సువిశాల స్థలంలో రూ.146కోట్లతో 125అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం బేస్మెంట్ను పార్లమెంట్ ఆకృతిలో నిర్మించడం విశేషం. ఈ విగ్రహం కింద మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్ కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. అంబేద్కర్ చరిత్రను ప్రతిబింబించేలా మ్యూజియంలో చిత్రపటాలు, రాజ్యాంగ తయారీ కోసం పడిన శ్రమను వివరించే ఫొటోలు ఉంటాయి. హుస్సేన్ సాగర్ నీటి కాలుష్యం, వాతావరణ మార్పులతో షైనింగ్ తగ్గకుండా, అతి భారీ తుఫానులను తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు.
ఈ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతిన (ఏప్రిల్ 14) సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు. మేధావులు, దళిత, బహుజనులకు ఈ విగ్రహం ప్రత్యేకంగా నిలుస్తున్నది. ప్రతిరోజూ వేలాది మంది ఈ విగ్రహాన్ని సందర్శిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ మహోన్నత ఘట్టాన్ని ప్రజలంతా వీక్షించే అవకాశం కల్పించనున్నారు. దీనికోసం ప్రతి నియోజకవర్గం నుంచి 300మందిని హైదరాబాద్‌కు సగౌరవంగా తీసుకొచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
గిరిజన సమ్మేళనం మాదిరిగా ప్రతి మండలానికి ఓ బస్సును ఏర్పాటు చేస్తారు. దీనికోసం కలెక్టర్లు నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించారు. ప్రజలను తీసుకెళ్లి తిరిగి స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేపట్టారు. ఇక్కడికి తీసుకొచ్చే ప్రజలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, నీళ్ల బాటిళ్లనూ అందించనున్నారు.. బయలుదేరే వాహనాలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు ఎస్కార్ట్ సిబ్బందిని నియమిస్తున్నారు. కంట్రోల్ రూంలు సైతం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహావిష్కరణను ప్రత్యక్షంగా వీక్షించేలా సామాన్యులకు సైతం అవకాశం కల్పించడంతో దళిత, బహుజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.