మహబూబ్నగర్ మున్సిపాలిటీ, డిసెంబర్ 7 : కేసీఆర్ ప్రభుత్వం గూడులేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. అయితే చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందించడంలో నిర్లక్ష్యంగా వ్య వహరిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకు ఇండ్లు ఎప్పుడిస్తారంటూ పాలమూరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో తమకు ఇండ్లు కేటాయించినా.. కాంగ్రెస్ సర్కారు హయాంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పాలకులు, అధికారుల నిర్లిప్తతో పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. త్వరగా అందిస్తే ఇండ్లకు తోరణాలు కట్టి.. ఇంట్లో పాలు పొంగించాలనుకున్నా.. వారికి నిరాశే మిగిలింది. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయినా.. లబ్దిదారుల ఎంపిక జరిగినా.. అర్హుల చేతికి ఇంటి తాళాలు మాత్రం అందించడం లేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. వాటి మ ధ్యన పిచ్చిమొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరాయి. వెచ్చించిన రూ.కోట్లు వృథా అవుతున్నాయి.
పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ పాలనలోనే పాలమూరులో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. భూ ములు కోల్పోయిన బాధితులతోపాటు అర్హులైన పేదలకు సైతం కొన్ని ఇళ్లను కేటాయించారు. అ యితే కొన్ని చోట్ల వివాదం నెలకొన్నది.
మహబూబ్నగర్ జిల్లాకు మొత్తం 8,566 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 7,811 ఇండ్లకు టెండర్లు పూర్తి కాగా 5,440 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే అత్యంత వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన వారిలో మూడో స్థానంలో పాలమూరు నిలిచింది. ఇంకా 491 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండగా.. పురోగతిలో 851.. ఇంకా 1,784 ఇండ్లు ప్రారంభించలేదు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న, ప్రారంభించని ఇళ్ల నిర్మాణాలకు సుమారు రూ.70 కోట్లకుపైగా నిధులు అవసరం ఉన్నాయి.
మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్లలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. వాటిలో నిర్మాణాలు పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారులను కేటాయించడం లేదు. పాలమూరు పట్టణంలోని మౌలాలి గుట్ట వద్ద జీప్లస్-2 విధానంలో ఇండ్లు నిర్మించి.. చాలా మందికి కేటాయించినా నేటికీ ఇంటి తాళాలు తీయనీయడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి అర్హులకు ఇళ్లు కేటాయించి.. తమ సొంతింటి కలను నెరవేర్చాలని పేదలు కోరుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన ఇండ్లను గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యికిపైగా పట్టణ ప్రాంతాల్లో రూ.3 వేలకుపైగా ఇండ్లు కేటాయించారు. వీరిలో చాలా మంది లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించలేదు. కొన్ని చోట్ల చాలా మందికి కేటాయించలేదు. కేవలం జాబితాను మాత్రం తయారు చేశారు. ఇప్పుడా ఇళ్ల వద్దకు జాబితాలో ఉన్న లబ్ధిదారులు వస్తుండగా ఎలా వస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల లక్కీడిప్ నిర్వహించారు. మరికొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణాలకు అనుగుణంగా కొందరికి మాత్రమే పట్టాలు ఇచ్చి.. ఆ తర్వాత పలువురు లబ్ధిదారులకు అందించినా అవి ఎలా కేటాయించరన్న దానిపై అధికారుల్లోనే స్పష్టత లేదంటూ.. అధికారులు ఇళ్ల తాళాలు ఇచ్చేందుకు విముఖత చూపెడుతున్నారు. తాళాలు ఇవ్వకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి.