Nagarkurnool | బిజినేపల్లి, ఏప్రిల్ 16 : కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది. మరో జింకకు గాయాలైన ఘటన మండలంలోని కిమ్యా తాండాలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగారం ఫారెస్ట్ పరిధిలో ఉన్న అడవిలో నుంచి ఈ నెల 12వ తేదీన ఒక జింక తండాలోకి రావడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో జింకపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఆ జింక మృత దేహాన్ని ఖననం చేయకుండా తండా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోనే ఉంచారు. ఈ జింక మృతదేహాన్ని సంబంధిత అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కళేబరంగా మారింది. దీనికి తోడు బుధవారం కూడా మరో జింక తండాలోకి వచ్చి ఇండ్ల మధ్యలో తిరుగుతుండగా కుక్కలు జింకపై దాడి చేసి గాయ పరచడం జరిగిందని తెలిపారు.
గమనించిన స్థానికులు నిరంజన్, దశరథ్, రాజేందర్ రెడ్డి తదితరులు కుక్కల బారి నుండి జింకను తప్పించడం జరిగింది అన్నారు. దీంతో కోలుకున్న జింక అడవిలోకి పరిగెత్తిందన్నారు. అటవీ శాఖకు సంబంధించిన డ్రైవర్ నవీన్, వాచర్ అంజి ఘటన స్థలానికి వచ్చేలోపే జింక అడవిలోకి వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ లోపంతోని ఇలా జరుగుతున్నాయని స్థానిక తండావాసులు వాపోతున్నారు. అధికారులు తమ విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉండడంవల్లే వన్యప్రాణులు అడవిలో నుంచి బయటికి వచ్చి మృత్యువాత పడుతున్నాయని అంటున్నారు. ఏదో మొక్కుబడిగా తమ విధులు నిర్వహించడం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వాపోతున్నారు.
గత నెలలో వట్టెం గ్రామ శివారులో కూడా జింక అడవిలోంచి గ్రామంలో కి రావడం జరిగింది. అప్పుడు కూడా కిందిస్థాయి సిబ్బంది అయినటువంటి అటవీశాఖ కార్ డ్రైవర్, వాచర్లు మాత్రమే ఈ జింకను తీసుకువెళ్లడానికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా తాండ వద్దా జింక కుక్కల దాడిలో గాయపడ్డ అదే కార్ డ్రైవర్, వాచర్లు రావడం జరిగింది. ఫారెస్ట్ సెక్షన్ అధికారి మాత్రం ఇలాంటి ఘటనలు జరుగుతున్న క్షేత్రస్థాయిలకి రాకపోవడం ఏంటని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఉన్నత స్థాయి అధికారులు ఉన్నట్లా లేనట్లా అని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.