వంగూరు, మే 9 : సీఎం రేవంత్రెడ్డి సొంత మండలమైన వంగూరులో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్యే మండల నాయకులపై విరుచుకుపడటం చూసిన వారు నివ్వెరపోయారు. కల్వకుర్తి పట్టణంలోని ఓ రహస్య ప్రాంతంలో గురువారం కాంగ్రెస్ మండల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య నేతలను మందలించడంతో వారు మనస్తాపం చెందారు. కొందరు బయటపడకపోయినప్పటికీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, కల్వకుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ పండిత్రావు శుక్రవారం మండలంలోని సర్వారెడ్డిపల్లి గ్రామంలోని తన ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1970 నుంచి కాంగ్రెస్లో పని చేస్తున్నానని తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్లో చేరి ఉద్యమాలు చేశానని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంతో తిరిగి కాంగ్రెస్లో చేరానన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో ఎవరూ కాంగ్రెస్ మండల బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోతే అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచన మేరకు పార్టీ బాధ్యతలు తీసుకొని ఆహర్నిశలు పార్టీ అభివృద్ధికి కృషి చేసి మండలంలో మెజార్టీ తీసుకొచ్చానన్నారు. ఇంత కష్టపడిన తనను పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడి అవమానించడం ఎంత వరకు సబబు అన్నారు. ఎమ్మెల్యే వైఖరితోనే మండలం కాంగ్రెస్ పార్టీ నాశనమైందన్నారు. దుందుభీలో ఇసుకను అక్రమార్కులకు అప్పజెప్పింది మీరు కాదా అని ప్రశ్నించారు. అధికారులను ఇష్టానుసారంగా బదిలీ చేస్తుంటే మండలంలో మాకు విలువేడుంటుందన్నారు. పార్టీ అభివృద్ధితో పాటు ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే ఇప్పుడు ప్రొటోకాల్ యాదికొచ్చిందాంటూ ఘాటుగా విమర్శించారు. అధికారం లేనప్పుడు పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తుల మాటలు విని తనపై ఘాటుగా మాట్లాడటం సరి కాదన్నారు. దీంతో మనస్తాపం చెంది కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు పండిత్రావు ప్రకటించారు.