దేవరకద్ర: దేవరకద్ర మేజర్ గ్రామపంచాయతీని ప్రభుత్వం గత రెండు నెలల రోజుల కిందట మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. దీంతో దేవరకద్ర మున్సిపాలిటీలో విలీనమైన వివిధ గ్రామాల ఉపాధి కూలీలు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల జిల్లా కార్యదర్శి సాంబశివుడు మాట్లాడుతూ ప్రభుత్వం దేవరకద్ర మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా చేసే సమయంలో ఎవరి అభిప్రాయం తీసుకుని మున్సిపాలిటీలో విలీనం చేశారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో విలీనమైన దేవరకద్ర, చౌదర్ పల్లి, బలుసుపల్లి, పెద్ద గోపులాపూర్, మీనుగోనిపల్లి గ్రామాలలో ఈనెల ఒకటో తారీకు నుంచి ఉపాధి పనులు నిలిపివేయడంతో పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాలలో ఉపాధి కూలీల అభిప్రాయాలు తెలుసుకొని విలీనం చేస్తే బాగుండేదన్నారు. ఆ విధంగా చేయకుండా విలీనం చేయడంతో ప్రస్తుతం ఉపాధి పనులు చేసుకుంటున్నా కూలీల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపాలిలో విలీనం చేసిన గ్రామాలలో ఉపాధి కల్పించాలని ధర్నా చేశారు. ఈ మేరకు ఎంపీడీవో శ్రీనివాసరావుకు ఉపాధి కూలీలు వినతి పత్రం అందజేశారు.