వనపర్తి టౌన్, జవనరి 9: కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలకు రైతుభరోసా ఇవ్వబోమని, వ్యవసాయ యోగ్యమైన భూములకు షరతుల్లేకుండా రైతుభరోసాను ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఏడు 33/11 సబ్స్టేషన్లకు భూమిపూజ, నిర్మాణం పూర్తయిన రెండు సబ్స్టేషన్లను డిప్యూటీ సీఎం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుభరోసా ఎవరెవరికీ ఇవ్వాలన్న దానిపై సమీక్షలు జరిపి రైతుల అభిష్టం మేరకు సాగుభూములకు రైతు పెట్టబడి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అందుకు అవసరమయ్యే రూ.8,400 కోట్లు జనవరి 26న ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి సస్యశామలం చేస్తామని చెప్పారు. 20వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ వాడకాన్ని తగ్గించి గ్రీన్ ఎనర్జీ కింద కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు, మిగులు కరెంట్‌ను ఇతర రాష్ర్టాలకు ఇచ్చేలా చూస్తామన్నారు. రాబోయే రెండు, మూడేండ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో పెండింగ్ ప్రా జెక్టులను పూర్తిచేస్తామన్నారు. పాలమూరును అన్నపూర్ణగా మార్చే బాధ్యత ప్రజాప్రభుత్వానిదన్నారు.రూ.2లక్షలలోపు రుణమాఫీ కానీ రైతులుంటే వివరాలు వెల్లడిస్తే పూర్తిచేస్తామని చెప్పారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అంతకుముందు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నూతనంగా నిర్మించనున్న 7 సబ్ స్టేషన్లకు వర్చువల్ పద్ధతిలో భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళి కా సంఘం ఉపాధ్యక్షుడ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎంపీ మల్లు రవి, జిల్లా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర క్రీడల చైర్మన్ శివాసేనారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ కొత్వాల్ తదితరులు ఉన్నారు.