గద్వాల, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ పాలనలో జిల్లాలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పేరుకు మాత్రమే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. అసలే మొక్క జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరగడంతో ఇప్పటికే రైతులు పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్మి నష్టపోయారు. ఉన్న కొంత మొక్క జొన్నపంటనైనా మార్కెట్లో అమ్ముకుందామంటే ప్రభుత్వం పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ రైతులు మార్కెట్కు తెచ్చిన మొక్కజొన్న కొనుగోలు చేయక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత గురువారం జిల్లాలో అధికారులు అయిజ, శాంతినగర్లో శుక్రవారం గద్వాల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
అయితే శాంతినగర్, అయిజ కేంద్రాల్లో రైతులకు టోకెన్లు ఇచ్చి మొక్క జొన్నలు కొనుగోలు చేస్తున్నా.. గద్వాల వ్యవసాయ మార్కెట్లో మాత్రం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రైతులకు టోకెన్లు ఇచ్చారు.. ఆ ప్రకారం రైతులు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రానికి మొక్కలు తీసుకొని వస్తే వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మొదటి రోజు హామాలీలు, చాటకూలీల మధ్య నెలకొన్న వివాదంతో కొనుగోలు పక్రియ నిలిచిపోయింది. అధికారులు ఇచ్చిన టోకెన్ల ప్రకారం రైతులు మార్కెట్కు మొక్కజొన్న పంటను తీసుక వచ్చారు. ధాన్యం తీసుకువచ్చి నాలుగు రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తమ పంట వద్దే రేయింబవళ్లు పడి గాపులు కాస్తున్నారు. తమ పంటను కొనుగోలు చేసి తమకు చేయూత ఇస్తుందని అనుకున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు ముందుకు సాగకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతులు 80,634 ఎకరాల్లో మొక్క జొన్న పంట సాగు చేశారు. దిగుబడి 10లక్షల బ్యాగులు వస్తాయని అధికారులు అంచనా వేశారు.
కొనుగోలు కోసం నిరీక్షణ
గద్వాల వ్యవసాయ మార్కెట్కు మొక్క జొ న్న పంటను తీసుకొచ్చి నాలుగు రోజులైంది. నాలుగు రోజుల నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కోసం అన్నం తిప్పలు మాని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెల కొం ది. కనీసం మార్కెట్లో రైతులు తాగుదామంటే నీటి సౌకర్యం లేదు. రైతుల గురించి ఆలోచించే వారు లేరు. అధికారులు స్పందించి వెంటనే మక్కలు కొనుగోలు చేయాలి.
– తిమ్మప్ప, రైతు, మల్దకల్, జోగుళాంబ గద్వాల జిల్లా
ఎవరూ పట్టించుకోవడం లేదు
టోకెన్లు ఇస్తే మూడ్రోజుల కిందట గద్వాల మార్కెట్కు మక్క పంట తీసుకొచ్చా.. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో? లేదో? అన్న అనుమానం కలుగుతోంది. కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో సగం పంట అప్పులు కట్టుకోవడానికే దళారులకు అమ్ముకున్నా. ఉన్న పంటను అమ్ముకుందామంటే ఇక్కడ ఎవరూ పలుకరించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు చేపట్టాలి.
– రాముడు, రైతు, మల్దకల్, జోగుళాంబ గద్వాల జిల్లా