మహబూబ్‌నగర్, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను కుదించే ప్రతిపాదన తెరపైకి వస్తోన్నది. కేవలం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని రెండు జిల్లాలను ఉంచాలన్న కాంగ్రెస్ సర్కారు సంకేతాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలుగా ఏర్పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, మెడికల్, నర్సింగ్ కళాశాలలతోపాటు ఎన్నో కార్యాలయాలు వెలిశాయి. కాగా నాటి సంక్షేమ పథకాలు, ఇతర విధానపరమైన నిర్ణయాలను పక్కకు పెట్టాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. వలసలకు, కరువుకు నిలయమైన ఉమ్మడి జిల్లా ఇప్పుడిప్పుడే బాగుపడుతూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు అభివృద్ధిలో పోటీ పడుతున్నది. ఈ తరుణంలో మళ్లా కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను కుదించాలనే నిర్ణయం షరాఘాతంలా మారింది. సీఎం సొంత జిల్లా అని కూడా చూడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలను తగ్గించాలని చూస్తుండడాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతోనే ఉమ్మడి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందింది. పరిపాలన సౌలభ్యంతో ప్రజలకు ఎంతో మేలు చేకూరింది. ఫలితంగా మారుమూల ప్రాంతాలు ఎంతో ప్రగతి సాధించాయి. ఈ నేపథ్యంలో తిరిగి ఐదు జిల్లాలను రెండుగా ఉంచాలని భావిస్తుండడంతో ఇక తిరోగమనమేనని మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నారాయణపేట జిల్లా కావడంతో అభివృద్ధిలో మిగతా జిల్లాలతో పరుగులు పెడుతున్నది. ఇక వనపర్తి జిల్లా కూడా చిన్న దే అయినా వ్యవసాయ, సాగునీటి రంగాల్లో మిగతా వాటిని వెనక్కు నెట్టింది. పాలమూరు జిల్లా కేంద్రం పారిశ్రామిక రంగంలో ముందంజలో నిలిచింది. ఐటీ టవర్ నిర్మా ణం, మెడికల్ కళాశాల, కొత్త కలెక్టరేట్, వె య్యి పడకల దవాఖాన, బైపాస్ రోడ్డుతో రూపురేఖలు మారిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి జిల్లాలతో ప్రగతిలో పోటీ పడుతున్నది. ఈ తరుణంలో కొత్త జిల్లాలను తొలగిస్తే కేవలం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ మాత్రమే ఉండే అవకాశం ఉన్నది. ఈ ప్రతిపాదన సర్కారు చేస్తుండడంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది అనాలోచిత నిర్ణయమని మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ జిల్లాల కుదింపును తప్పుబడుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే భంగ పాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు మహబూబ్‌నగర్ పేరు వింటేనే వలసలకు, కరువుకు ప్రసిద్ధి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ఈ జిల్లాపై తీవ్ర వివక్ష చూపించారు. ప్రాజెక్టుల పేరుతో ఇక్కడి సంపదలు దండుకొని పదేండ్లు వైఎస్ హయాంలో కాంగ్రె స్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయింది. తెలంగాణ ఆవిర్భావమయ్యాక ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ప్రభుత్వం ఐదు జిల్లాలుగా విభజించి వలసలు, కరువుకు కేరాఫ్‌గా మారిన పాలమూరు జిల్లాను విముక్తి చేశారు. పదేళ్ల హయాంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సు సాధ్యం అనుకొని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఇక్కడి చరిత్రను తిరగరాశారు. జిల్లాకు చెందిన మంత్రు లు, ఎమ్మెల్యేలు అభివృద్ధిలో పోటీపడుతూ సాగు, తాగునీరు, రహదారులు, పరిపాలనా పరమైన భవనాలు, విద్యా, వైద్య, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు, ఐదు లక్షలు కూడా సాగుకాని భూములు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌గా మార్చడంతోపాటు కొత్తవి నిర్మించడంతో ఏకంగా 18 లక్షల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో జిల్లా కేంద్రాలు, మారుమూల పల్లెలు వేగంగా అభివృద్ధి చెందా యి. రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రభుత్వ సంక్షేమాలను అందించి ఆసరా ఇచ్చింది. దీంతో వలసలు తగ్గి ఇక్కడికి రివర్స్ వలసలు వచ్చే రోజులు వచ్చా యి. పాలమూరు ఐటీ పార్కు, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలో కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలతోపాటు మెడికల్ కళాశాలలు నిర్మించి స్వరూపాన్ని మార్చేశారు. నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవననంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం కొనసాగుతున్నది. పరిపాలనా పరంగా ప్రజలకు కొత్త జిల్లాలు చేరువయ్యాయి. ఒక్క గంటలోనే ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకొని పనులు ముగించుకొని తిరిగి సొంతూళ్లకు వెళ్లే వెసులుబాటు కలిగింది. అయితే కాంగ్రెస్ సర్కారు ప్రజల నెత్తిమీద మరో పిడుగు పడేలా చేసింది. జిల్లాలను కుదించి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలను ఉంచాలన్న ప్రతిపాదనలను తెరమీదకు తీసుకురాగా.. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నాడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మారుమూల మండలాల నుంచి జిల్లా కేంద్రానికి ప్రజలు రావాలంటే ఎన్నో ఇబ్బందులు, వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పరిపాలనాపరమైన ఇబ్బందులను తొలగించేందుకు, ప్రజలకు మరింత చేరువలో ఉన్నతాధికారులు ఉండాలని లక్ష్యంతో ఉమ్మడి జి ల్లాను మూడు జిల్లాలుగా విభజించింది. ఆ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరమీదకు రాగా.. అక్కడి ప్రజల అభీష్టం మేర కు నాటి సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. అయితే కర్ణాటక సరిహద్దుగా ఉన్న నారాయణపేట ప్రాంతం కూడా జిల్లాగా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేటకు ప్రచారానికి వచ్చిన కేసీఆర్ ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు మళ్లీ అధికారంలోకి వస్తే జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఫిబ్రవరిలో నారాయణపేటను జిల్లాగా ప్రకటించారు. దీంతో ఉమ్మడి పాలమూరు ఐదు జిల్లాలుగా రూపాంతరం చెందింది.
బూటకపు వాగ్దానాలు చేసి అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయ్యారు. ఈ జిల్లాను ఎలా బాగు చేయాలి .. అనే అంశాన్ని పక్కనబెట్టి.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను రూపుమాపే ప్రయత్నం చేయాలని చూస్తోంది. ఉమ్మడి జిల్లాను విభజించి ఐదు జిల్లాలు ఏర్పాటు చేసి అభివృద్ధిలో పోటీ పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం జిల్లాలను కుదించి మళ్లీ పాత రోజులు తీసుకొచ్చి అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నది. ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడడం ఖాయం.