ఊర్కొండ, సెప్టెంబర్ 8 : రెండు నెలలుగా విజయ డెయిరీ పాలబిల్లులు చెల్లించకపోవడంతో రైతన్నలు అప్పులపాలవుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గిరినాయక్ పేర్కొన్నారు. పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలకేంద్రంలోని ఎన్హెచ్-167పై పాలు పోసి నిరసన తెలిపారు. అనంతరం ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
రైతులకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా గిరినాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలోని రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని సూచించారు. పాడి పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదన్నారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు దాణా కొనుగోలు, ఆవుల నిర్వహణకు అప్పులు చేయవల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఊర్కొండపేట బీఎంసీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువ పాడి రైతులు వానకాలం సాగు, పాఠశాలల ఫీజుల చెల్లింపునకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇకనైనా విజయడెయిరీ రైతులకు పెండింగ్ బిల్లులు మొత్తం ఒకేసారి ఖాతాలో జమ చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేదిలేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. కార్యక్రమంలో బీజేపీ నేత ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు కృష్ణగౌడ్, తిరుపతిరెడ్డితోపాటు పాడి రైతులు పాల్గొన్నారు.