జడ్చర్ల, మార్చి 14 : ఆరుగాలం కష్టించి పనిచేసే రై తులు ఏటా ఏదో ఒకరూపంలో పంటలను నష్టపోతూ నే ఉన్నారు. ఉంటే అతివృష్టి, లేదా అనావృష్టి ఈ రెం డింటికీ మధ్య రైతులు నలిగిపోతున్నారు. వ్యవసాయా న్నే నమ్ముకొని జీవనం సాగించే రైతులకు పంట మంచి గా పండితే ఆనందం.. లేదంటే అప్పులు తప్పా మిగిలేదేమీ ఉండదు. వ్యవసాయం అంటేనే నీటి ఆధారం గా పంటలు సాగు చేయడం దానికి వర్షాలే ఆధారం. ఆ వర్షాలు ముఖం చాటేస్తే ఇక అందరిపని గోవిందా.. ఈ ఏడాది వానకాలంలో వర్షాలు ప్రతి యేడాదిలా అ నుకూలంగా కురవకపోవడం వలన భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లలో నీళ్లు రాక ఈ యాసంగిలో బోర్లుకింద సాగుచేసిన వరి, మొ క్కజొన్న, గోధుమ తదితర పంటలు ఎండుతున్నాయి.
చాలా వరకు రైతులు యాసంగిలో వరినాట్లు వేసి కొం తమంది కలుపు తీస్తుండగా కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో ఉన్నాయి. నీళ్లు అవసరమైన సమయంలోనే సరిపడ నీళ్లులేక వరిపైర్లు ఎండుతుండటంతో రైతులు ఆం దోళనకు గురవుతున్నారు. ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలు పెట్టుబడి పెట్టి పంటలను సాగుచేస్తే అవి మధ్యలోనే ఎండిపోతున్నాయి. కండ్లముందే పంటలు ఎండిపోతున్నా కాపాడుకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారు. పంటలను కాపాడుకోవడానికి కొత్తగా బోర్లు వేసినా వాటిలో నీళ్లు రావడం లేదు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లుకూడా ఎప్పటికంటే 100 ఫీట్లు అధికంగా లోతుకు వేయడం జరుగుతున్నది. అయినా నీళ్లు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేండ్లు వర్షాలు బాగా కురవడంతో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు సాగు చేసుకున్న రైతులకు ఈ యేడాది సరైన వర్షాలు లేకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
పొట్టదశలో ఉన్న పంటలను కాపాడుకోలేక రైతులు పశువులను మేతకు వదిలేస్తున్నారు. జడ్చర్ల మండలంలో యాసంగిలో దాదాపు 6వేలకుపైగా ఎకరాలలో వరిపంట సాగు చేశారు. గత ఏడాదికంటే 2వేల ఎకరాలు తక్కువగా వరి నాటడం జరిగింది. అందుకు కారణం జనవరిలోనే బోర్లలో నీళ్లు తగ్గడంతో రైతులు సాగును తగ్గించారు. కానీ భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతుండడంతో బోర్లు నీళ్లు పోయడం లేదు. కొంతమంది రైతులకు చెందిన వరి పంటలు పూ ర్తిగా ఎండిపోతుంటే.. మరికొంతమంది రైతులది ఆరుతడిలా నీటిని ఇస్తున్నారు. ఇక నెలరోజులైతే వారి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఎండి న పంటలనైనా గుర్తించి ప్రభుత్వం రైతులకు నష్టపరిహా రం చెల్లించాలని వేడుకుంటున్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా బోర్లలో నీళ్లు అడుగంటిపోయాయి. ఎకరం వరిపంట నాటితే కలుపుతీశాక నీళ్లు సరిపోకపోవడంతో ఎండిపోతున్నది. రూ.30 వేలు పెట్టుబడి పెట్టి వరి నాటితే బోర్లలో నీళ్లులేక ఎండిపోతుంది. ఏమిచేయలేని పరిస్థితిలో ఎండిపోతు న్న వరిపైరులో రోజూ ఎద్దులను మేపుతున్నా.. మూ డుబోర్లను ఒక్క చోట కలిపినా ఆ నీటితో గుంట కూడా పారడం లేదు. ఇటువంటి కాలం ఎన్నడూ చూడలేదు.
– లింగం, రైతు, కోడ్గల్, జడ్చర్ల మండలం
ప్రతి సంవత్సరంలా యాసంగిలో కూడా మంచి గా నీళ్లు ఉంటాయిలే అని ఎకరం పొలంలో గోధుమసాగు చేశా. కానీ బోర్లలో నీ ళ్లు రావడం లేదు. దీంతో గోధుమ పంట చేతికందే సమయంలో ఎండిపోయింది. కాలాన్ని నమ్ముకుంటే నట్టేట ముంచింది. పంటసాగు చేయక పోయినా పెట్టుబడి మిగిలేది. కానీ పంటెండింది.. పైసలుపోయినవి. ప్రభుత్వమైనా ఆదుకుంటే బాగుంటుంది.
– ఆంజనేయులు, రైతు, బూరెడ్డిపల్లి, జడ్చర్ల