జూరాల ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేవు. దీంతో దాదాపు రెండు నెలల నుంచి వానకాలం సీజన్ పంటలకే వారబంది ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ పంట చేతికి వచ్చిన వేళ.. యాసంగి సాగు రైతులను సందిగ్ధంలోకి నెట్టింది. ప్రధానంగా జూరాల ప్రధాన ఎడమ కాల్వపై ఆధారపడి సిస్తులు చేసే రైతన్నలు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఆయా ప్రాజెక్టుల కింద యాసంగి సాగుకు సంబంధించి హైదరాబాద్‌లో బుధవారం ఎస్‌సీఐడబ్ల్యూఏఎం (స్టేట్ లెవల్ కమిటీ ఫర్ వాటర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్) సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో సాగు, తాగునీటి కేటాయింపులపై చర్చ జరగనున్నది. అనంతరం అధికారులు సాగు వివరాలను వెల్లడించనున్నారు.
వనపర్తి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : వానాకాలం వరి పంట చేతికి రాగా, యాసంగి సాగు రైతులను సందిగ్దంలోకి నెట్టింది. ప్రధానంగా జూరాల ప్రధాన ఎడమ కాల్వపై ఆధారపడి యాసంగి సిస్తులు చేసే రైతన్నలు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం వానాకాల సీజన్ వరి కోతలు దాదాపు ముగియగా, యాసంగి సాగులో వరికి బ్రేక్ పడినట్లుగానే భావిస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో నీరు అంతంత మాత్రమే ఉండటంతో వచ్చే మరో మూడు నెలలపాటు యాసంగిలో వరికి సాగునీరందించడం కష్టమన్న వాదనలు వినిపిస్తున్నాయి. జూరాల ప్రధాన ఎడమ కాల్వ దాదాపు 100 కిలోమీటర్ల పొడవునా 10 మండలాలు కలుపుకొని జూరాల డ్యాం నుంచి సుమారు పెంట్లవెల్లి మండలం వరకు ఉంది. అధికారికంగా 70వేల ఆయకట్టు ఉంటే, అనధికారికంగా మరో 30వేల ఎకరాలు మోటర్ల ద్వారా సాగులోకి వస్తున్నది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో మంగళవారం నాటికి 4.380 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, కుడి కాల్వకు 325 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 401 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింకు కెనాల్‌కు మరో 300 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ నుంచి 1,092 క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉండగా, 1,543 క్యూసెక్కుల నీటిని పంట కాల్వలకు బయటకు పంపుతున్నారు.
యాసంగిలో జూరాల కాల్వలకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టులో నీటి నిల్వలు సమృద్ధిగా లేకపోవడంతో రెండవ పంట సాగు సందిగ్దంలో పడింది. దాదాపు నెలరోజులకుపైగా జూరాల కాల్వల కింద వరికోతలు జరుగుతున్నాయి. చివరి దశకు రావడంతో మరో పక్షం రోజుల్లో ముగిసిపోనున్నాయి. అయితే, యాసంగిలో జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కష్టమేనన్న అభిప్రాయం వెల్లడవుతున్నది. ఎగువన నారాయణపూర్ డ్యాం కింద కూడా యాసంగిలో సాగు చేయడం లేదని తెలుస్తున్నది. డ్యాంలో నీటి పరిస్థితులను బట్టి అక్కడ కూడా రెండో పంటకు నీటి విడుదలపై సందిగ్దమే నెలకొంది. నారాయణాపూర్ డ్యాం కింద రెండవ పంట సాగైతే, దిగువన జూరాలకు కొంత నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి కర్ణాటకలో కూడా రెండో పంటసాగు నిర్ణయించకపోగా, ఊగిసలాటనే ఉంది. దీంతో అంతంత మాత్రమే నీటి నిల్వలు ఉన్న జూరాల కింద యాసంగి సాగుబడులు ప్రశ్నార్థకమేనన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జూరాల ప్రాజెక్టు కింద వానకాలం పంటలకే వారబంది ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో తలెత్తలేదని రైతులు చెబుతున్నారు. దాదాపు రెండు నెలల నుంచి వానకాలం వరిసాగుకు వారబంధి ద్వారానే నీటిని అందిస్తూ వచ్చారు. వారంలో మూడు రోజులు మాత్రమే కాల్వలకు నీటి విడుదల చేస్తున్నారు. జూరాల కింద రైతులు ప్రతి ఏటా రెండు పంటలు పండించుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో వర్షాల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. భారీ వర్షాలు, వరదలు లేనందునా జూరాల కింద ఒక పంటకే నీటి విడుదల జరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో క్రాఫ్ హాలిడే అన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి.
వానకాలంలో ముందుగా సాగు చేసుకున్న రైతులు రెండోపంటకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ నెలలోనే కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి కోతలు పూర్తి చేసుకున్నారు. ప్రాజెక్టుల ద్వారా అక్కడక్కడా చెరువులను నింపుకొన్నారు. అలాగే బోరుబావులు సైతం నీటిని సమృద్ధిగానే అందిస్తున్నాయి. ఈ క్రమంలో కేవలం వీటి ఆధారంగానే యాసంగిలో వరినాట్లు వేసుకునే పరిస్థితి ఉంది. వరుసగా నాలుగేండ్లుగా నీటి సౌకర్యాలు మెరుగవడంతో జిల్లాలో యాసంగిలోనూ భారీగా సాగుబడికి అవకాశం ఉన్నది. ఈసారి ఎన్నికల కోలాహ లం ముగిసిన అనంతరం యాసంగి పనులు మరింత వేగవంతమయ్యా యి. నారుమడులు సిద్ధ్దం చేసుకోవడం, నారు సిద్ధమైన రైతు లు నాటేందుకు మడులు సిద్ధం చేయడంలాంటి పనుల్లో నిమగ్నమయ్యారు.
ప్రాజెక్టుల కింద యాసంగిలో సాగుబడులకు సంబంధించి హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లోని ఇరిగేషన్ ఈఎన్సీ కార్యాలయంలో బుధవారం స్టేట్ లెవల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఎన్సీలు, అడ్మినిస్టేటీవ్ ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు పాల్గొని ప్రాజెక్టుల్లోని నీటి పరిస్థితులపై చర్చించి ఓ నిర్ణయానికి రాబోతున్నారు. ఈ సమావేశం అనంతరం స్థానికంగా జూరాల అధికారులు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్ష్యంలో ఇరిగేషన్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉంటే, ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ, ఎగువ నారాయణాపూర్ డ్యాం నుంచి వచ్చే నీటి అంచనాలను వేసుకుని యాసంగి సాగుబడులను నిర్ణయిస్తారు. కాగా, వచ్చే ఎండాకాలానికి అవసరమైన తాగునీటిని కూడా అధికారులు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మార్చి 30వ ఏదీ తర్వాత ప్రాజెక్టుల్లో సాగుబడులకు నీటిని విడుదల చేసే పరిస్థితులు ఉండవు. అప్పటికే ప్రాజెక్టుల్లో తాగునీటి కోసం కేటాయించిన లెవెల్స్ వరకే నీటిని తీసుకోవాల్సి ఉంది. వీటన్నిటినీ పరిశీలించిన అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఇరిగేషన్ బోర్డు సమావేశం నిర్వహించి సాగు వివరాలను వెల్లడించనున్నారు.
యాసంగి వరిపంటకు నారుమడి పోసుకునే సమయం దాటిపోతున్నది. ఇంత వరకు సారోళ్లు అమరచింత ఎత్తిపోతల పథకం అయకట్టు కాల్వకు సాగు నీటిని విడుదల చేయలేదు. తొమ్మిదేండ్లుగా ఈ ఎత్తిపోతలతోనే సాగు చేస్తుంటిమి. ప్రతి యేడు నవంబర్ మొదటి లేదా రెండో వారంలో నారుమడికి నీటిని వదిలేటోళ్లు. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారం దాటిపోతున్నా నీళ్ల గురించి ఏం చెప్తలేరు. రాబోయే కాలంలో తాగునీటి లేకుంటే మళ్లా పాతకాలం రోజులు కండ్ల ముందు కనపడుతున్నయి.
ఎప్పుడు లేనిది వారబంధి పద్ధతిలో నీటిని విడుదల చేయడంపై గోపల్‌దిన్నె రిజార్వాయర్ ఆయకట్టు రైతులందరం ఆందోళన చెందుతున్నాం. వీపనగండ్ల, చిన్నంబావి మండలాల ప్రజలు ఈ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే బోరుబావులపై ఆధారపడుతున్న కొంత మంది రైతులు యాసంగి పంట కోసం ఇప్పటికే నారు పోస్తున్నరు. రిజర్వాయర్ నీటిపై ఆధారపడి రైతులు అయోమయంలో పడ్డారు. అధికారులు నీళ్లిస్తారో, లేదో తెలపాలె.
జూరాల కింద సాగుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. హై దరాబాద్‌లో నేడు జరిగే సమావేశం అనం తరం అన్ని విషయాలు తెలుస్తాయి. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని యాసంగిపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి ని ల్వల ఆధారంగానే సమా వేశంలో నిర్ణయాలు ఉంటా యి. ఆ తర్వాతే నీటి విడు దలపై స్పష్టత వచ్చే అవకాశమున్నది.
యాసంగికి జూరాల నీరు వదులుతారో లేదో అయోమయంగా ఉంది. మొన్నటిదాంక వారబంధి అన్నరు కానీ ఇప్పటి పరిస్థితులు అట్ల కనిపించడం లేదు. వానలు లేకపోవడం వల్ల ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని చెబుతున్నరు. సాగు చేసినంక నీటి పరిస్థితి ఏంటో చెప్తలేరు. నారు పోసుకోనీకె కూడా రైతులు సంశయిస్తున్నరు.