మహబూబ్నగర్ అర్బన్ అక్టోబర్ 11 : దసరా పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలతో పాలమూరు ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. సరిపోయినన్ని బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తాండూరుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేది లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ప్రమాదభరితంగా తరలించారు. చేసేది లేక ప్రయాణికులు ఆపసోపాలు పడుతూ గమ్యస్థానాలకు చేరుకున్నారు. కాగా, దసరా పండుగకు పది రోజుల ముందుగానే ఉమ్మడి జిల్లాల్లో 694 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పినా ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ విషయమై ఆర్ఎం శ్రీదేవి, డిపో మేనేజర్ సుజాతను వివరణ కోరగా, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.