కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 1 : వరి రైతులు అరిగోస పడుతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు రైతులకు చుక్కలు చూ పిస్తున్నది. ఒకప్పటి కాంగ్రెస్ పాలనలోని కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని రైతులు వాపోతున్నారు. కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన వెంకటయ్య ఐదెకరాల పొ లాన్ని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు.
చివరి దశకు పంట చేరుకున్న సమయంలో ఒకవైపు బోర్లు ఎండిపోవడం, మరోవైపు పగటి పూట కరెంట్ కోతలు విధించి రాత్రి వేళలో ఎప్పుడు ఇస్తున్నారో తెలియక తికమకపడుతున్నారు. కేసీఆర్ సర్కారులో వ్యవసాయానికి 24గంటల కరెంటు అందించి రైతు సంక్షేమానికి పాటుపడగా, రేవంత్ సర్కారు మాత్రం కరెంట్ కోతలతో రైతులను నష్టపోయే లా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలి. కేసీఆర్ సర్కారులాగా 24గంటల కరెం ట్ అందించగలిగితే రైతులు నష్టపోయే అవకాశం లేకుండే. వరి పైరు చేతికొచ్చే సమయంలో కరెంట్ కోతలు, భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలి.
– వెంకటయ్య రైతు, మార్చాల