వనపర్తి (నమస్తే తెలంగాణ)/మూసాపేట(అడ్డాకుల)/మక్తల్, అక్టోబర్ 25 : చేతికొచ్చిన పంట కండ్లముందే తడిసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ వానకాలం నాట్లు మొదలుకొని కొత లు కోసే వరకు వర్షాలు కర్షకులను ఏదో ఒక రూపంలో నష్టాలను మిగులుస్తూనే ఉన్నాయి. అడ్డాకుల మండలం కందూరు ఆలయం వద్ద రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. అకస్మికంగా కురిసిన వర్షంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. మూసాపేట మండలంలోని ఆయా గ్రామాల్లో సైతం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. వెంటనే వరి కోనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
అకస్మాత్తుగా శనివారం కురిసిన వర్షానికి వనపర్తి జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలు నీటిపాలయ్యా యి. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు పలు గ్రామాల్లోనూ రైతులు ఆరబోసుకున్న పంటలు తడిసిపోయాయి. కొన్నిచోట్ల రైతులు కవర్లను కప్పుకున్నా ఉపయోగం లేకుండాపోయింది. తడిసిన ధాన్యం ఆరబెట్టాలంటే రెండు మూడ్రోజుల సమయం పడుతుందని రైతు లు ఆవేదన చెందుతున్నారు. పంట పండించడం ఒక ఎత్తయితే, వాటిని రూపు చేసి అమ్ముకోవడం రైతులకు తలకుమించిన భారంగా మారింది.
అకాల వర్షాలతో అతలాకుతలమవుతున్నది.. దీంతో మొక్కజొన్న, పత్తి, వరిపంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మక్తల్ మండలంలోని పస్పుల, పంచదేవ్పాడు, పారేవుల, ముస్లాయిపల్లి, దాదన్పల్లి, అనుగొండ, ముష్టిపల్లి గ్రామాల్లో చేతికొచ్చిన వరిపంటలు దాదాపు 200 ఎకరాల్లో నేలకొరిగాయి. దీంతో రైతులు ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కండ్లముందే నష్టపోతుంటే కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.