అచ్చంపేటరూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ( Local Body Elections ) పోటీ చేయడానికి సీపీఎం(CPM ) సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ ( Tigala Sagar ) వెల్లడించారు. అచ్చంపేట పట్టణంలో సీఐటీయూ ( CITU ) కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యుల, మండల కార్యదర్శిల సమావేశం దేశనాయక్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎర్ర జెండాకు ప్రజలు మద్దతుగా నిలవాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రశ్నించే ఎర్రజెండా నాయకులను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు . నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజులేని పోరాటం నిర్వహిస్తున్న సీపీఎంకు ఎన్నికల్లో మద్దతు తెలిపి అత్యధిక స్థానాలను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయ లబ్ధి పొందినందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలు భారీ వర్షాల వలన నష్టపోయిన రైతాంగాన్ని పంట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, బి ఆంజనేయులు, చింతల ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు మల్లయ్య, ఎం శంకర్ నాయక్, పరశురాములు, చింతల నాగరాజు, బాలస్వామి, శివ వర్మ, వర్ధన్ సైదులు, మల్లేష్, తారాసింగ్, మధు, రవి, శ్రీనివాస్, దశరథం, నిర్మల తదితరులు పాల్గొన్నారు.