ఊట్కూర్, అక్టోబర్ 29 : జిల్లాలోని ఊట్కూర్ మండలం విజయకాటన్ ఇండస్ట్రీలో నిర్వహిస్తున్న పత్తి కొనుగోళ్లను బుధవారం అధికారులు నిలిపి వేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా చేపట్టిన పత్తి కొనగోలు కేంద్రాన్ని అధికారులు మూసివేయడంతో ఆగ్రహించిన పత్తి రైతులు ఇండస్ట్రీ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పత్తి రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంతో దాదాపు 3గంటల పాటు ప్రధాన రహదారికి ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. రైతు ల ధర్నాతో అటు నారాయణపేట ఇటు మక్త ల్ పట్టణాల వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సివచ్చింది.
కాగా, మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాల కారణంతో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు నిలిపి వేస్తున్నట్లు సీపీవో శ్రీనివాస్ ప్రకటించగా ఉదయం 9గంటలకే వాహనాలతో ఇండస్ట్రీ వద్దకు చేరుకున్న రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే ప్రధాన రహదారిపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీఐ ద్వారా పత్తిని అమ్ముకునేందుకు ముం దస్తు టైం స్లాట్ నమోదు చేసుకున్నామని.. రైతులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కొనుగోళ్లను నిలిపివేస్తే కూలీలు, వాహనాల ఖర్చులను ఎవరు భరిస్తారని అధికారులను నిలదీశారు.
పండిన కొద్ది పాటి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం, అధికారులు నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దిగిరావాలని, తక్షణమే కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు భీష్మించారు. ఈ సందర్భంగా అధికారులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసున్న మక్తల్ సీఐ రాంలాల్, ఊట్కూర్ ఎస్సై రమేశ్ బలగాలతో ఇండస్ట్రీ వద్దకు చేరుకుని ముందస్తు చర్యలు చేపట్టారు. తాసీల్దార్ చింత రవి, మక్తల్ మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, ఏవో గణేశ్‌రెడ్డి ఇండస్ట్రీ దగ్గరకు చేరుకుని రైతుల సమస్యలను సీసీఐ దృష్టికి తీసుకువచ్చారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వా త కొనుగోళ్లను ప్రారంభించేందుకు అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, పత్తికి 8 నుండి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని, అంతకంటే ఎక్కువ తేమ శాతం ఉన్న పత్తిని కొనుగోలు చేయమని సీసీఐ అధికాలు స్ప ష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 30, 31 రెండు రోజులు పత్తిని కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు తమ స్లాట్ బుకింగ్‌ను రద్దు చేసుకుని కొత్త తేదీలను నమోదు చేసుకోవాలని పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రైతులకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.