నాగర్కర్నూల్, డిసెంబర్ 1 : పత్తి బాగా లేదని సాకుతో కొనుగోలు నిలిపి వేయడంతో ఆగ్రహించి రైతులు రోడెక్కి ఆందోళనకు దిగిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం చిన్న ముద్దునూరు కాటన్ మిల్లు ముందు చోటు చేసుకున్నది. గత మూడు, నాలుగు రోజులుగా ఎదురు చూసిన రైతులు తీరా తూకం వేసే సమయానికి మ్యాచర్ లేదని సాకు చెబుతూ కొనకపోవడంతో రైతులు మండిపడ్డారు.
మిల్లు బయట వాహనాలు నిలుపగా పంట నాణ్యతను చూసిన అధికారులు మిల్లులోకి తీసుకెళ్లి సగం పత్తిని కిందకు దించిన తర్వాత బాగా లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఎదురు చూస్తున్నామని, తీరా కొనుగోలు చేసే సమయానికి సాకులు చెబుతూ కొనుగోలు నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. బాగున్న పత్తిని సైతం మిల్లులోకి తోసుకున్న తర్వాత బాగా లేదని చెప్పడం ఏమిటని మండిపడ్డారు.
సమయానికి కొనుగోలు చేయకపోవడంతో అద్దెకు తెచ్చిన వాహనాలకు సైతం రోజుల తరబడి కిరాయి చెల్లించాల్సి వస్తుందని, తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నామని పలువురు మహిళా రైతులు ఆగ్రహించారు. పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని భీష్మించుక కూర్చున్నారు. దీంతో నాగర్కర్నూల్- శ్రీశైలం రహదారి వైపు వెళ్లే వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. చివరకు కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.