గద్వాల, నవంబర్ 5 ; పత్తి రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయిద్దామంటే సీసీఐ కొర్రీలతో ఆందోళన చెందుతున్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న నిబంధనతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత టెక్నాలజీపై కర్షకులకు ఎక్కువగా అవగాహన లేకపోవడంతో యాప్ డౌన్లోడ్ చేయడానికి పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. రోజుకు వంద మంది మాత్రమే నమోదు చేసుకునేలోపు సైట్‌ను అధికారులు బంద్ చేస్తున్నారు. ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకున్నా.. ఎకరాకు 7 క్వింటాళ్లే కొంటామంటూ నిబంధనలు పెడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ మొద్దు నిద్రలో జోగుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా మంది పత్తిని విక్ర యించేందుకు ముందుకు రావడం లేదు. మరి కొందరేమో ఈ తతంగమంతా తమకెందుకంటూ తెల్లబంగారాన్ని దళారులకు విక్రయిస్తున్నారు.
నిబంధనల పేరుతో పత్తి సాగు చేసిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. రైతన్నలకు ఓ వైపు ప్రకృతి సహకరించకపోగా చేతికి వచ్చిన పత్తిని అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే అక్కడి నిబంధనలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో రైతులు ఈ తల నొప్పులు భరించలేక తమ పత్తిని దళారులకు అమ్మి మోసపోతున్నారు. ఓ వైపు కేంద్రం పత్తి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి వారికి చేయూ తనిస్తామని చెబుతూనే కఠిన నిబంధనలు అమలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో ప్రభుత్వ తీరుపై రైతన్నలు మండిపడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ వానకాలం సీజన్లో రైతులు 1,42,410 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. జిల్లాలో గద్వాల, అలంపూర్‌లో సీసీఐ ద్వారా రెండు పత్తి కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఇప్ప టి వరకు జిల్లాలో 139మంది రైతుల నుంచి 4350 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం పత్తికి తేమశాతం 8 నుంచి 12 వరకు ఉంటే ధర రూ.8110 చెల్లిస్తుండడంతో ఎక్కువగా రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించడానికి వస్తున్నారు.
స్లాట్ బుకింగ్‌తో రైతన్నల అవస్థలు..
పత్తి అమ్ముకోవాలంటే కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలనే నిబంధన ఉండడంతో రైతులకు స్లాట్ బుక్ చేసుకోవడానికి రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రైతులకు ఎక్కువ శాతం ప్రస్తుత టెక్నాలజీపై అవగాహన లేకపోవడంతో యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ బుకింగ్‌పై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవ సాయశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. రైతులకు సహాయకారిగా ఉండాల్సిన ఏఈవోలు, ఏవోలు ఇతర విధుల్లో ఉండడంతో వారు రైతులకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో రైతులకు స్లాట్ బుకింగ్‌పై అవ గాహన లేక పోవడంతో వారికి ఏమి చేయాలో తోచడం లేదు.
జిల్లాలో స్లాట్ బుకింగ్ రోజుకు వంద మంది రైతులు మాత్రమే నమోదు చేసుకునేలోపు సీసీఐ అధికారులు సైట్ బంద్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మళ్లీ ఎప్పుడు సైట్ ఓపెన్ చేస్తారో అని రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తిప్పలు భరించలేని రైతులు తాము పండించిన పత్తిని దళా రులకు అమ్ముకుంటున్నారు. స్లాట్ బుకింగ్‌ని ఆసరాగా చేసుకున్న దళారులు రైతులతో కొన్న పత్తిని రైతుల పాస్ పుస్తకాలు తీసుకొని వారి పేర విక్రయిస్తున్నారు. దళారులకు స్లాట్ బుకింగ్ సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు.. ఎప్పుడు బంద్ చేస్తారో.. అన్న విషయాన్ని తెలుసుకొని బుకింగ్ చేసుకొని సొమ్ము చేసుంటున్నట్లు తెలిసింది. రైతులకు మాత్రం సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో.. ఎప్పుడు బంద్ అవుతుందో.. తెలియక పోవడం దళారులకు కలిసి వచ్చే అంశం.
నిబంధనల పేరుతో కొర్రీ..
స్లాట్ బుకింగ్‌తో సతమత మవుతున్న రైత న్నలకు నిబంధనల పేరుతో సీసీఐ కొర్రీలు వేయడంతో రైతు లు జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతంలో రైతు ఎంత పత్తిని సీసీఐకు తీసుకొచ్చిన కొనుగోలు చేసేవారు. 12 క్వింటాళ్లకు బదులు ప్రస్తుతం ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ వారు చెప్పడంతో రైతులు ఆందోళన చెంది పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
గతంలో లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకని, సీసీఐ వారు ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా పత్తిని ఎవరు కొనుగోలు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు రైతన్నలకు 8 నుంచి12 శాతం తేమ నిబంధనలకు తోడుగా స్లాట్ బుకింగ్ ఉంటనే కొనుగోలు చేస్తామంటూ ఖరాకండిగా చెప్పడం, ఎకరాకు ఏడు క్వింటాలే కొంటామని సీసీఐ వారు చెప్పడంతో రైతులకు ఏమి చేయాలో తోచక ముచ్చెమటలు పడుతున్నాయి. పంట సాగు చేసి మార్కెట్ తీసుక వస్తే ఇదేమి తిప్పలని రైతులు ఆందోళ చెందుతున్నారు. నానా కష్టాలు పడి తీసిన పత్తిని అమ్ముకునేందుకు కేంద్రాలకు తీసుక వస్తే నిబంధనలతో రైతులు సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు స్పంది ంచిన స్లాట్ బుకింగ్ విషయంలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ఎకరాకు ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామనే నిబంధన సడలించి రైతు పండించిన పత్తిని మొత్తం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.