తెల్ల బంగారానికి నకిలీ విత్తనాల బెడద దాపురించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి తర్వాత రైతులు ఎక్కువగా పండించే పంట పత్తి. దీంతో నాసిరకం విత్తనాలను పెద్దఎత్తున సరఫరా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. సీడ్స్ ఆర్గనైజర్ల పేరుతో జోరుగా దందాకు తెరలేపారు. కంపెనీ తయారు చేసే నాణ్యమైన సీడ్స్‌ను కాదని తమ సీడ్ వాడితే నజరానా అందజేస్తామని ఆశ చూపు తున్నారు. ధర తక్కువ అంటూ డీలర్లు అంటగడుతుండడంతో రైతులు మోస పోతున్నారు. కొందరు డీలర్లు గ్రామాల్లో సీడ్ ఆర్గనైజర్ల అవతారమెత్తి యువతను మభ్యపెట్టి వారి ద్వారా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి వ్యాపారం ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా విరాజిల్లుతున్నది.
– మహబూబ్‌నగర్, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి జిల్లాలో ము ఖ్యంగా మహబూబ్‌గర్, జో గుళాంబ గద్వాల జిల్లా నకిలీ విత్తనాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. గద్వాల జిల్లాలో ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో రూ.కోట్ల నకి లీ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. గతేడాది గద్వాల జిల్లాలో పెద్దఎత్తున కిలాడీ సీడ్ పేరుతో అంటగట్టి రైతులను నట్టేట ముంచారు. అయినా ఏ ఒక్కరిపై కేసులు నమోదు కాక పోగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారన్న గుసగుసలు వినిపించాయి.
అన్ని జిల్లాల్లో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దించినా లాభం లేకపోయిందన్న ఆరోపణలు వినిపించాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడడం ఇందుకు నిదర్శనం. మరోవైపు బీజీ-3 విత్తనాలు కొనొద్దని.. కేవలం బీజీ-2 విత్తనాలు మాత్రమే కొనాలని వ్యవసా య శాఖ సూచిస్తు ంది. నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పాలమూరు కలెక్టర్ విజయేందిరబోయి హెచ్చరించారు.
తక్కువ ధరకు దొరుకుతాయనే ఆశతో..
నకిలీ విత్తనాలు తక్కువ దొరుకుతాయన్న ఆశతో రైతులకు కొనుగోలు చేస్తుండడంతో అసలుకే మోసం వస్తున్నది. ప్రభుత్వం నాణ్యమైన పత్తి విత్తనాలు తయారు చేసేందుకు కొన్ని కంపెనీలకు మాత్రమే అనుమతినిచ్చింది. కావేరి, నూజివీడుతో సహా మరో మూడు నాలుగు కంపెనీలు ఈ విత్తనాలను సరఫరా చేస్తున్నాయి. 450 గ్రా ముల ప్యాకెట్ రూ.1000 నుంచి రూ.1200 ధరకు లభ్యమవుతున్నది. కానీనకిలీ విత్తనాల ప్యాకెట్ రూ.600 వరకు విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాలను వాడటంతో దిగుబడి తగ్గడమే కాకుండా భూసారం తగ్గే అవకాశం ఎన్నది. తక్కువ ధరకు దొరికే విత్తనాలను వాడొద్దని.. కంపెనీయే వాడాలని వ్యవసాయ శాఖ సూచిస్తున్నది.
వరి తర్వాత పత్తి సాగే ఎక్కువ..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వరి తర్వాత రైతులు పత్తినే ఎక్కువగా సాగు చేస్తున్నారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతోపాటు అనేకచోట్ల మినీ లిఫ్టులతో చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. గొలుసుకట్టు చెరువులను కూడా నింపడం వల్ల ఉమ్మడి జిల్లాలో సాగునీటికి కొరత లేకుండా పోయింది.
గద్వాలలో జోరుగా నకిలీ దందా
జోగుళాంబ గద్వాల జిల్లా అం టేనే నకిలీ విత్తనాల తయారీకి అడ్డాగా మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో జిల్లాలో నకిలీ సీడ్స్ తయారవుతున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతున్నారు. ఈ జిల్లాలో గ తంలో నకిలీ విత్తనాల రాకెట్‌ను ఛేదించిన ఓ పోలీస్ ఉన్నతాధికారినే బదిలీ చేయించారు. సీడ్స్ డీలర్లు అధికార పా ర్టీ నేతలకు రూ.కోటుల ముట్టజెప్పి తమ వ్యాపారాన్ని కొ నసాగిస్తున్నారు. దీంతో పోలీసులు, వ్యవసాయ శాఖాధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఈ జిల్లాలో నకిలీ విత్తనాలు కొని తీవ్రంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరగడం లేదు. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసులు లేకుండా చేస్తున్నా రు. సీడ్స్ అమ్మే రెండు నెలలు పోలీసులు, వ్యవసాయ అధికారులకు మామూళ్లు ఇచ్చి పని కానిచ్చేస్తున్నారు.
భూత్పూర్, జడ్చర్లలో ..
మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్ పట్టణాల్లో నకిలీ విత్తనాల దందా కొనసాగుతున్నది. కొన్ని షాపుల్లో దర్జాగా విత్తనాలు అమ్ముతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటీవల జడ్చర్లలో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. భూత్పూర్ పట్టణంలో కూడా ఇదే రకంగా అనేక చోట్ల నాసిరకం విత్తనాలను ప్యాకెట్లుగా మార్చి రైతులకు అంట గడుతున్నారు. గతంలో అనేకమార్లు దాడులు నిర్వహించినా ప్రస్తుతం దాడులు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు బలం చేకూరుతున్నది.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
ప్రభుత్వ అనుమతి లేని నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు పోలీస్, వ్యవసాయ శాఖాధికారులతో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఈ టీంలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. జూన్ కంటే ముందే వర్షాలు పడుతున్నందున జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేయనున్నారు. అనుమతి లేని బీజీ-3 పత్తి విత్తనాలు నిల్వ చేయడం, అమ్మడం, విత్తడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మడం చట్టరీత్యా నేరం. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటాం. పదేండ్ల వరకు జైలు శిక్ష, పీడీ యాక్ట్ నమోదుతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
– విజయేందిరబోయి, పాలమూరు కలెక్టర్