అయిజ, జనవరి 5 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని వరంగల్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే రైతులకు హామీ ఇచ్చి నయవంచనకు గురి చేశారని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య ఎద్దేవా చేశారు. ఆదివారం అయిజ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా పథకం కింద కేవలం రూ.12వేలు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. నైతిక విలువలేని రేవంత్‌రెడ్డి రైతాంగానికి బహిరంగ క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లు రూ.15వేలు ఇవ్వాల్సిందేనన్నారు.
రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతు కుటుంబాలను బజారున పడేసేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నదన్నారు. రైతులంటేనే కాంగ్రెస్‌కు గిట్టదనే విషయం తేటలెల్లమైందని విమర్శించారు. రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేయకపోగా, రైతుభరోసాను రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12వేలు ఇస్తామని చెప్పడం వారి చేతగాని తనానికి నిదర్శనమన్నారు. ధాన్యం కొనుగోళ్లలోనే నిర్లక్ష్యం చేయడంతో చాలా మంది వ్యాపారులకు అమ్ముకొని నిండా మునిగారన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని, నేటికి రైతుల ఖాతాలో జమ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు చిరునామాగా మారిందన్నారు. రైతు భరోసా గురించి వెల్లడించేందుకు మంత్రులు మాట్లాడేందుకు ముఖంచాటేయడం చూస్తుం టే సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులే పంగనామం పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతు భరోసా కింద ఎకరాకు రూ.17,500 రైతులకు ఇవ్వాల్సి ఉండగా, నేడు రూ.6వేలు ఇచ్చి చేతు లు దులుపుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నదన్నారు. మిగి తా రూ.11,500 ఎవరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధి హామీ జాబ్‌కార్డులు కలిగిన రైతు కూలీలందరికీ ప్రతి యేటా రూ.12వేలు అందించాలన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే అర్థం ఏమిటో రేవంత్‌రెడ్డి రైతులకు స్పష్టంగా చెప్పాలని డి మాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మత్తాలి, మాధవ్, అనిల్‌గౌడ్ పాల్గొన్నారు.