ధన్వాడ/గోపాల్పేట/మల్దకల్, మార్చి 24 : ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తెల్లవారు జాము నుంచే ఆయా గ్యాస్ ఏజెన్సీల ముందు పడిగాపులు కాస్తున్నా సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో మంగళవారం నారాయణపేట జిల్లా ధన్వాడలో వినియోగదారులకు సిలిండర్ల కోసం పెద్ద ఎత్తున చేరుకోవడంతో గ్యాస్ ఏజెన్సీ వారు పోలీసులను పిలిపించి 60 మందికి మాత్రమే గ్యాస్ పంపిణీ చేపట్టారు.
అయితే సిలిండర్ బుక్ చేసుకున్న బుక్ కావడం లేదని, బుక్ చేసిన వారికి ఓటీపీ రావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాల్పేట మండ ల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్లు వచ్చాయని తెలిసి వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం ఎండలో సైతం సిలిండర్లను పట్టుకొని క్యూలో వేచి ఉన్నారు. అయినా అందరికీ సిలిండర్లు అందకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. మల్దకల్ మండల కేంద్రంలో 25 గ్రామ పంచాయతీలకు గానూ కేవలం ఒకే ఒక గ్యాస్ గో దాం ఉండడంతో మంగళవారం వివిధ గ్రామాలకు చెందిన వినియోగదారులు తెల్లవారు జాము నుంచే గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు.
సిలిండర్ బుక్ చేసుకున్న వారి కంటే బుకింగ్ చేయని వారే ఎక్కువగా గోదాంకు చేరుకున్నారు. దీనిపై గ్యాస్ గోదాం యాజమాన్యంతో సంప్రందించగా నాలుగైదు రోజులు వివిధ గ్రామాలకు చెందిన 990 మంది కస్టమర్లు గ్యాస్ బుకింగ్ చేసుకున్నారన్నారు. అయితే ఒక లోడులో 342 గ్యాస్ సిలిండర్ వచ్చాయన్నారు. బుక్ చేసుకున్న వారికి ఓటీపీ వచ్చిన వారు మాత్రమే రావాలని చెప్పినా అందరూ వస్తున్నారని దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అయితే ఈ రోజు రాత్రి ఇంకో లోడు వస్తుందని రెండు రోజుల వరకు బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందజేస్తామని పేర్కొన్నారు.