మాగనూర్/మక్తల్‌టౌన్, జూన్ 22 : ‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. ఇసుక అనుమతి లేకుండా తరలిస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వం అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’.. అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మాగనూర్ మండల కేంద్రానికి సమీపంలోని పెద్ద వాగు నుంచి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పెద్దవాగు వద్దకు వెళ్లిన ఆయన అక్కడ ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి బంధువులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మరోవైపు స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి అండదండలతో కృష్ణానది పరీవాహక ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు ఇసుక తరలిస్తూ కొందరు నేతల అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇసుక తవ్వకాలతో మాగనూర్ వాగు ఎడారిని తలపిస్తున్నదని ఆవేదన చెం దారు. పలుమార్లు ఇసుక తరలింపుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
కృష్ణ మండలంలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ‘అడ్డొస్తే అంతు చూస్తాం’ అంటూ మాఫియా బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఫోన్ చేసి దౌర్జన్యంగా బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నా రాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను కలిసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం వినతిపత్రం అందజేశారు. కృష్ణ మండలంలో నదీ తీరప్రాంతంలో అనుమతులు లేకుండా.. మాగనూరు మండలం ఉజ్జల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి ఇసుక తరలిస్తుండడంతో అడ్డుకునేందుకు యత్నం చేశాడని తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత శివరాజ్ పాటిల్‌కు ఈనెల 18న రాత్రి శ్రీనివాస్‌రెడ్డి బంధువులు సురేశ్‌రెడ్డి, ఈశప్ప, భీమన్న ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వీరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.