రైతులు సాగుకు సమాయత్తమవుతుండగా.. ఇదే అదునుగా విత్తన మాయగాళ్లు పల్లెలపై పడుతున్నారు. నడిగడ్డ రైతులత సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు చెలగాటం ఆడుతున్నారు. అమా యక అన్నదాతలను టార్గెట్ చేస్తూ వారు పండించిన సీడ్ పత్తి విత్తనాలు నాణ్యత పరీక్షలో ఫెయిలైనట్లు చూపిస్తూ మోసగిస్తున్నారు. కంపెనీలు ఈ ఏడాది విత్తనాలు ఇవ్వడం లేదని చెబుతూనే.. ప్యాకెట్ ధర కంటే రూ.50 తగ్గించి ఇస్తామని వారిని నమ్మిస్తున్నారు. కర్ణాటకలో లేబర్ ఖర్చులు తక్కువగా ఉన్నందునా అక్కడ సీడ్ పత్తి సాగును ప్రోత్సహించి.. నడిగడ్డలో తగ్గించే కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తున్నది. అయినా వ్యవసాయ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో సీడ్ పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
– గద్వాల, మే 27
జోగుళాంబ గద్వాల జిల్లాలో కంపెనీలు, ఆర్గనైజర్లు అమాయక రైతులను ప్రతి ఏటా మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. రైతు ఆరుగాలం కష్టపడి సీడ్ పత్తి పండించి కంపెనీలకు విత్తనాలు అందిస్తే నాణ్యత ప్రమాణాల పేరుతో రైతు లు నాణ్యమైన విత్తనాలు కంపెనీలకు ఇచ్చినా అవి ఫెయిల్ అయ్యాయని చెబుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైతులను కాపాడాల్సిన వ్యవసాయశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో రైతులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. రైతుకు ఇచ్చిన విత్తనాలు నాణ్యత లోపం వల్ల పంట రాకపోతే ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో రైతులకు అంతు చిక్కడం లేదు. వ్యవసా య శాఖ అధికారులు ఇది మా పరిధిలో రాదు మొత్తం ప్రైవేట్ వ్యవహారం అంటూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రైతు నష్టపోయిన, వారికి చేయూతనిచ్చేవారు కరువయ్యారు.
దేశంలో అధికంగా..
దేశంలోనే అత్యధికంగా పత్తి పంట ను సా గు చేస్తున్న ప్రాంతం నడిగడ్డ. ఈ ప్రా ంతంలో 30 వేల నుంచి 45 వేల ఎకరాల వరకు రైతులు సీడ్ పత్తి సాగు చే స్తున్నారు. అయితే ప్రస్తుతం రైతులు సీడ్ పత్తి సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాలు ఇచ్చే విషయంలో ఇవ్వకుండా కంపెనీలు, ఆర్గనైజర్లు వారితో చెలగాటం ఆడుతున్నారు. కంపెనీలు విత్తనాలు ఇవ్వడం లేదని ఆర్గనైజర్లు చెబుతూనే, ప్యాకెట్ ధర ప్రస్తుతం ఉన్న దాని కంటే కంపెనీలు రూ.50 తగ్గించి ఇస్తామని చెబుతున్నారని ఆర్గనైజర్లు చెబుతున్నారు. విత్తనాలు ఇవ్వడం లేదంటూనే ప్యాకెట్‌కు ధర రూ.50 తగ్గించి ఇస్తామని చెప్పడం వెనుక మర్మమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నా రు. కర్ణాటకలో లేబర్ ఖర్చులు తక్కువగా ఉండడంతో అక్కడ సీడ్ ఇ వ్వడానికి కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఇక్కడి రైతులకు సీడ్ విత్తనాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం.
పాసైనా.. ఫెయిలైనట్లుగా చూపుతున్న వైనం
సీడ్ కంపెనీలు సొంతంగా పెట్టుకున్న జీవోటీ (గ్రో అవుట్ టెస్ట్)ద్వారా విత్తనాలను పరీక్షించి విత్తనాలను ఫెయిల్ అయ్యాయని కంపెనీలు మోసం చేస్తున్నాయి. కానీ రైతు లు వారు పండించిన పత్తి విత్తనాలను ప్రైవేట్ ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే పాసైనట్లు నిర్ధారణ అవుతున్నాయి. అయితే ఉద్దేశపూర్వకంగా రైతులను కంపెనీలు మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లికి చెందిన చిన్న నర్సింహులు వేదా సీడ్స్ కంపెనీకి చెందిన వీఎస్-999 బీజీ-11 అనేరకం విత్తనాలు పెద్దొడ్డికి చెందిన ఆర్గనైజర్ రాముడు ద్వారా తీసుకున్నాడు. పంట సాగు చేసి విత్తనాలను కంపెనీకి 275611 లాట్ ద్వారా టెస్ట్‌కు పంపిస్తే జెన్టిక్ ప్యూరిటీ 78.6 శాతం రావడంతో ఫెయిలైనట్లు కంపెనీ చెప్పిందని రైతు తెలిపాడు.
అవే విత్తనాలను రైతు సాహితీ బయోటెక్ ల్యాబ్, ఏలీసా టెస్ట్ రిపోర్టు ద్వారా పరీక్ష చేయిస్తే పాజిటివ్ రావడంతోపాటు 90 శాతం, 100 శాతం జెన్టిక్ ప్యూరిటీ వచ్చినట్లు వివరించాడు. అలాగే అదే గ్రామానికి చెందిన డోలు కృష్ణ ఆర్ఎస్-666 రకం వేదా సీడ్స్ కంపెనీ విత్తనాలను సాగు చేసి కంపెనీకి 24991975 అనే లాట్ ద్వారా టెస్ట్‌కు పంపాడు. జెన్టిక్ ప్యూరిటీ 78.6 శాతం రాగా ఫెయిల్ అయిందని కంపెనీ, ఆర్గనైజర్లు రైతుకు తెలిపారు. ఇదే విత్తనాలను సాహితీ బయోటెక్ ల్యాబ్, ఏలీసా టెస్ట్ ద్వారా పరీక్షిస్తే పాజిటివ్ 88 శాతం, జెన్ ప్యూరిటీ 97.78 శాతం వచ్చిందని.. రెండింటిలో పాజిటివ్ 90 శాతం, జెన్ప్యూరిటీ 100 శాతం వచ్చిందని పేర్కొన్నరు. కంపెనీ ల్యాబ్‌లో ఫెయిల్ కావడం ఏమిటీ..? బయట ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే పాస్ ఎలా అవుతున్నాయి..? ఇది ఉద్దేశ పూర్వకంగా కంపెనీలు, ఆర్గనైజర్లు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ రాష్ట్ర నేత కుర్వ విజయ్‌కుమార్ ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులను ఎలా మోసం చేస్తున్నారో వెల్లడైంది.
ప్యాకెట్ ధర తగ్గింపుపై ఆగ్రహం
కంపెనీలు ప్రతిఏటా ఏదో ఓ సాకుతో ఆర్గనైజర్లను అడ్డం పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నాయి. ఈ విత్తనాలు ఇచ్చిన కంపెనీ లాభాల్లో ఉంటున్నాయి. కంపెనీలకు రైతులకు మధ్య దళారులుగా వ్యవహరిస్తున్న ఆర్గనైజర్లు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారే తప్పా.. కష్టపడి విత్తనాలు పండించిన రైతు మాత్రం వీరి తీరుతో తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ ఏడాది సీడ్ సాగు చేసే రైతులకు కంపెనీలు పెద్ద షాక్‌నిచ్చాయి. విత్తన ప్యాకెట్ ధర రూ.50 తగ్గిస్తున్నామని.. మీ ఇష్టం ఉంటే విత్తనాలు తీసుకోండి.. లేదంటే ఇతర ప్రాంతాల రైతులకు సీడ్ ఇస్తామని కంపెనీలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి.
దీంతో అన్నదాతలకు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. గత సీజన్లో జీఎస్ఎం వెరైటీ పత్తి విత్తనాలకు ప్యాకెట్‌కు ధర రూ.500 ఉండగా.. ఈ సీజన్లో ధర రూ.450 నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కన్వేన్షన్ వెరైటీ రూ.600 ఉండగా.. ఈ ఏడాది రూ.550 వరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే రైతులు సాగు చేసిన సీడ్ పత్తి కల్తీ విత్తనాల వల్ల జర్మినేషన్ రాక ఫెయిల్ కావడంతో తీవ్రంగానష్టపోతున్నారు. దీనికితోడు నడిగడ్డలో సీడ్ సాగు తగ్గించే లక్ష్యంతో సీడ్ ఇవ్వకపోవడం.. ధర తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ధర తగ్గిస్తే రైతులు ఎకరాకు రూ.50 వేల వరకు నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా వ్యవసాయశాఖ కమిషనర్‌తో కలుగ జేసుకొని న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.