మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకవైపు అధికారం, మరోవైపు పోలీస్ యంత్రాంగం సహకారం ఇంకోవైపు ఎన్నికల అధికారుల అండదండలతో తాము అనుకున్నది సాధించారు. అయినా మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో మెజార్టీకి దూరంగా నిలిచిపోయారు. ఎక్కడ మేయర్ పదవి చేజారుతుందో అన్న భయంతో రాత్రికి రాత్రి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. అర్ధరాత్రి గెలిచిన కార్పొరేటర్లను క్యాంప్ ఆఫీసుకు పిలిపించి బస్సుల్లో ఆంధ్రాకు తరలించారు.
సీఎం సొంత జిల్లాలో అధికారం ఎక్కడ చేజారుతుందోనని భయంతో క్యాంప్ రాజకీయాలకు తెరలేపడం ఒక ఎత్తు అయితే ఆంధ్రాకు తీసుకెళ్లి క్యాంప్ పెడితే సేఫ్ అని ఏకంగా చీరాలకు తరలించారు. ఇక మిగతా మున్సిపాలిటీ లో అధికారం కైవసం చేసుకున్నా పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య పదవుల పంపకంపై పేచి మొదలైంది. ఇక గద్వాలలో అరాచకీయమే రాజ్యమేలింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే చేసిన పనికి ఎన్నికల అధికారులు సైతం వత్తాసు పలకడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అయితే ఇండిపెండెంట్లను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకొని పీఠం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీచేసి గెలిచిన అభ్యర్థులకు అధికార పార్టీ ప్రలోభపెట్టి భారీ ఆఫర్ ఇచ్చి ఏకంగా సీఎం దగ్గరికి తీసుకెళ్లి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.
ఆ జిల్లాలో ఖాతా తెరిచేందుకు పెద్దఎత్తున ప్రలోభాలకు గురిచేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇంత చేసినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్కు వచ్చి న ఓటింగ్ శాతం చూసి అధికార పార్టీ కంగుతిన్నది. అధికార పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్కు కేవలం 10శాతం మాత్రమే వ్యత్యాసం ఉంది. వార్డు స్థానాల్లో కూడా గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. సీఎం సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గెలిచిన ఆనందంలో పైశాచికత్వం ప్రదర్శిస్తూ అర్థరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటికెళ్లి దాడికి దిగారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు.. ఇప్పుడు రణరంగాన్ని తలపించాయి. అడుగడుగునా నిబంధనలు తుంగలోకి తొక్కి అధికారం కైవసం చేసుకున్నారు.
ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్పై దాడులు
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక చాలాచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపాలిటీలో విపక్షాలను బెదిరించి భయపెట్టి ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నా అధికార పార్టీ నాయకులు అర్ధరాత్రి ఒకటో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ దంపతులపై దాడికి తెగబడ్డారు. ఎక్కడ ఓట్లు వేయకపోతే ఏమవుతుందోనని ప్రజలు కూడా భయపడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. మహబూబ్‌నగర్‌లో కూడా ఆయా డివిజన్లో హోరాహోరీ పోరు నడిచింది. అయితే బీఆర్ఎస్ గెలవడంతో ఓటమిని తట్టుకోలేక భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వారికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. మిగతా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో అక్కడక్కడ బెదిరింపులకు దిగారు. ఇక గద్వాలలో విపక్షాలు లేకుండా చేస్తామని ఫిరాయింపు ఎమ్మెల్యే అనుచరులు బాహాటంగా ప్రకటిస్తున్నారు.
క్యాంపునకు తరలిన కార్పొరేటర్లు
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మ్యాజిక్ ఫిగర్‌కు మూడు సీట్లు దూరంగా ఉన్న అధికార పార్టీ హడావుడిగా అర్ధరాత్రి కార్పొరేటర్లను క్యాంప్‌నకు తరలించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు బస్సుల్లో 28 మంది కార్పొరేటర్లను, కొందరు స్వతంత్ర కార్పొరేటర్లను తీసుకువెళ్లినట్లు సమాచారం. వీరందరిని తన రాజకీయ గురువు చంద్రబాబు పర్యవేక్షణ ఉంటుందని.. ఆంధ్రాకు పంపించారు. వీరందరిని ఒంగోలు జిల్లా చీరాల రిసార్ట్‌లో ఉంచినట్లు సమాచారం . వీరంతా మందు, విందులతో చిందులు వేస్తున్నారు.
ఇదిలా ఉండగా డిప్యూటీ మేయర్ పదవిపై తీవ్ర పోటీ రావడంతో కొంతమంది కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీకి ఇవ్వాలని కొంతమంది.. పాత కాంగ్రెస్ నేతలకు ఇవ్వాలని మరికొంతమంది.. పట్టుబడుతున్నారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో 40ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన బెనహర్ కూతురికీ డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తుంది. మరో ఆరుగురు డిప్యూటీ మేయర్ కోసం పోటీపడుతున్నారు. అసంతృప్తి తీవ్రస్థాయిలో పెరుగుతోందని సమాచారం. ఒకవేళ అదే జరిగితే మేయర్‌ను ఎన్నుకొని డిప్యూటీ మేయర్‌ను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
సత్తా చాటిన మాజీ మంత్రి
మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఒంటరి పోరాటం ఫలించింది. హోరాహోరీ పో రులో 16డివిజన్లను గెలుచుకున్నారు. నాలుగుస్థానాలు 25 ఓట్ల తేడాతో కోల్పోయారు. మరో మూడు స్థానాలు 100లోపు ఓట్ల తేడా తో ఓటమి పాలయ్యారు. ఈ సీట్లే గనక వస్తే కార్పొరేషన్లో బీఆర్ఎస్ కీలకంగా మారేది. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తామని ప్రతిపక్ష పాత్రలు హుందాతనంగా పోషిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పెండింగ్ పనులను పూర్తిచేసేలా ఒత్తిడి చేస్తామని.. కా ర్పొరేషన్ అభివృద్ధి చేసేందుకు పార్టీ తరఫున ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఇక మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చక్రం తిప్పారు. అమరచింతలో హంగ్ రావడంతో మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన మెజార్టీని సాధించి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తున్నారు. మొత్తంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండేళ్లలో అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నం కావడం.. ప్రజలు కారుకే జై కొట్టడం చూస్తుంటే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన ఫలితాలు రాబోతున్నాయి అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.