నగరం నుంచి రాజీవ్ రహదారి మార్గంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ ప్రక్రియకు ప్రామాణికత లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. బహిరంగ ధర..ఎస్ఆర్వో రేట్లను విస్మరించి.. గజానికి 3 లక్షలున్నా.. పదివేలున్నా.. అదే లక్షన్నర అంటూ.. భూ బాధితులతో పరిహారం విషయంలో పరిహాసం ఆడుతున్నది సర్కార్. ప్రభుత్వ అశాస్త్రీయ, వైరుధ్య నిర్ణయాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. భూములు, ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రభుత్వ కార్డ్ రేట్, బహిరంగ మార్కెట్లోని ధరలను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు తమకు తోచిన విధంగా పరిహారాన్ని కట్టబెడుతుండటంతో నిండా నష్టపోతున్నారు. -సిటీబ్యూరో
సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): జేబీఎస్ నుంచి తూంకుంట వరకు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భూముల కార్డు ధరకు, ప్రభుత్వం ఇస్తున్న పరిహారానికి మధ్య ఎలాంటి ప్రామాణికత లేదని స్పష్టమవుతున్నది. ప్రాంతాల వారీగా ప్రభుత్వ ధర, అధికారులు చెల్లిస్తున్న పరిహారాన్ని గమనిస్తే స్పష్టమవుతున్నదని రాజీవ్ రహదారి జేఎసీ స్పష్టం చేస్తున్నది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు రెండు జిల్లాల మధ్య ఉన్న హద్దు పరిస్థితులతో, పరిహారం తీరు కూడా వేరుగా ఉందని వాపోతున్నారు.
ప్రాంతానికో తీరుగా పరిహారం
జేబీఎస్ నుంచి తిరుమలగిరి ఎక్స్ రోడ్డు వరకు ఎస్ఆర్వో విలువ గజానికి రూ. 50వేలుగా ఉంటే… ప్రభుత్వం మాత్రం రూ. 1.40 లక్షలు మాత్రమే ఇస్తానంటోంది. అదేవిధంగా తిరుమలగిరి నుంచి లోతుకుంట వరకు ఎస్ఆర్వో విలువ గజానికి రూ.37వేలు ఉన్నా… ప్రభుత్వం ఆఫర్ చేసిన రేటు గజానికి రూ. 90వేలు మాత్రమే. ఇక లోతుకుంట నుంచి అల్వాల్ వరకు ఎస్ఆర్వో ధర గజానికి రూ. 27వేలుగా ఉంటే, ప్రభుత్వం గజానికి రూ. 1.10లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇక ఆల్వాల్ నుంచి తూంకుంట వరకు గజానికి ఎస్ఆర్వో విలువ రూ. 10వేల ఉన్నా కూడా గజానికి రూ. 1.10లక్షలుగా ఇస్తుండటం చూస్తే పరిహారం తీరుగా ఏ విధంగా ఉందనేది స్పష్టయమవుతున్నది.
అన్యాయం ఇక్కడే…
ఎస్ఆర్వో, బహిరంగ మార్కెట్, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ధరలను పరిశీలిస్తే బాధితులకు సర్కార్ అన్యాయమే చేస్తున్నదని స్పష్టమవుతున్నది. అల్వాల్ నుంచి తూంకుంట ప్రాంతంలో ఎస్ఆర్ఓ ధర రూ. 10,700 ఉన్న చోట రూ. 1.10 లక్షలు పరిహారంగా పది రేట్లు ప్రకటించింది. అదే తిరుమలగిరి నుంచి లోతుకుంట వరకు ఉన్న ఆస్తులకు రూ. 37వేల ఎస్ఆర్వో ధరలపై 3 రేట్లు చొప్పున మాత్రమే ఇచ్చింది. ఇక జేబీఎస్ నుంచి తిరుమలగిరికి వచ్చే సరికి రెండు రేట్లు కూడా దాటడం లేదని వాపోతున్నారు. వీటి ధరలు ఇలా ఉంటే బహిరంగ మార్కెట్ ధరలను సర్కార్ పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. కనీసం బహిరంగ ధరల ఆధారంగా పరిహారం చెల్లించిన ప్రాజెక్టు అవసరమైన భూసేకరణ ఎప్పుడో పూర్తయ్యేదనీ జేఎసీ నాయకులు వివరించారు. స్థానిక ధరలు, డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా అందరికీ ఒకే లెక్కన రూ. 1.40లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తే భూములు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా విక్రంపురి, తిరుమలగిరి వాణిజ్య కేంద్రాల సమీపంలో బహిరంగ ధరలు రూ. 5లక్షలు దాటినా కూడా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు.
కదలని భూసేకరణ
అధికారులు నిర్ధారించిన ఈ అశాస్త్రీయమైన పరిహారం వల్ల బాధితులు తమ సర్వం ఆస్తులను కోల్పోవాల్సి వస్తుందంటున్నారు. వాణిజ్యపరంగా ఎంతో డిమాండ్ ఉంటే ఆస్తులను కోల్పోయే వారికి సరైన న్యాయమే జరగడం లేదని వాపోతున్నారు. అందుకే భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదని బాధితులు చెబుతున్నారు. అల్వాల్, తూంకు ంట పరిధిలో ఉన్న ప్రస్తుత వాస్తవ మార్కెట్ ధరలు, వాణిజ్య ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, కనీస ధరను రూ. 3-4లక్షలుగా నిర్ణయించాలని, దీంతో భూములు కోల్పోయిన జరిగిన నష్టం తీవ్రత కొంతైన తగ్గుతుందని వివరించారు.
ఇక నగదు రూపంలోనే సర్కార్ పూర్తి పరిహారం చెల్లించాలని, అలాంటిది కాకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు అంగీకరించేది లేదని జేఎసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ స్పష్టం చేశారు. టీడీఆర్ పేరిట బాధితులను ఆకట్టుకోవాలని చూ స్తున్నా, పరిహారంపై స్పష్టం వచ్చేంత వరకు మెజార్టీ జనాలు భుములు ఇవ్వడానికి సిద్ధం గా లేరన్నారు. నిజానికి సర్కార్‌కు నష్టపోతున్న బాధితులకు లబ్ధి చేయాలనే ఉద్దేశమే ఉంటే… ముందుగా తమతో పరిహారం గురి ంచి చర్చించాలన్నారు. అంతకంటే ముం దుగా ప్రతిపాదిత ప్రాజెక్టుల వారీగా ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకుని పరిహారం తేల్చాలని డిమాండ్ చేశారు. అంతే గానీ టీడీఆర్ రూపంలో ఇచ్చే పరిహారానికి తామేమి సిద్ధంగా లేమని, న్యాయం జరిగే వరకు ధర్మపోరాటం సాగుతుందని తేల్చేశారు.