మూసీ సుందరీకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు హాస్యాస్పదంగా ఉన్నది. మూసీ మురుగును శుద్ధి చేయకముందే ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నది. సుందరీకరణ కంటే ముందు మూసీ ప్రక్షాళన చేయాలి. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది.
సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) : మూసీ ఫేజ్-1లో భాగంగా రూ.7345 కోట్లతో గాంధీ సరోవర్ నిర్మించేందుకు నిధులు కేటాయించారు. ఇందులో జోన్-1(ఏ) కింద హిమాయత్‌సాగర్-బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లకు రూ.3232 కోట్లు, జోన్-1(బీ) కింద ఉస్మాన్‌సాగర్-బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్లకు రూ. 4113 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మూసీ సుందరీకరణ చేపట్టనున్నట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్తున్నది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మూసీలో చేరుతున్న మురుగును శుద్ధి చేయకుండానే సుందరీకరణ చేస్తామంటూ వింతపోడలు పోతున్నది.
అంతే కాకుండా మూసీనదిలోకి గోదావరి జలాలను తరలిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. మూసీ ప్రక్షాళన, గోదావరి జలాల తరలింపు చేపట్టకుండానే సుందరీకరణ చేస్తామంటూ.. పనులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు డీపీఆర్ బయటపెట్టలేదు. సుందరీకరణకు ముందు చేపట్టాల్సిన ప్రక్షాళనను గాలికొదిలేశారు. గోదావరి జలాల విషయాన్ని అసలే పట్టించుకోవడం లేదు. అసలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి, ఎంఆర్డీసీఎల్ తీరేంటని పరీవాహక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎస్టీపీలు నిర్మించకుండానే సుందరీకరణా?
మూసీ ప్రక్షాళన కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీనదిపై 39 ఎస్టీపీలను నిర్మించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా చాలా వరకు నిర్మాణం పూర్తయి మురుగు నీటిని శుద్ధి చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మిగిలిన వాటి నిర్మాణం మందకొడిగా సాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు పరిధిలోకి మూడు ఎస్టీపీలు నిర్మాణం కానున్నాయి. సంగం బాపుఘాట్, హైదర్షాకోట్, నార్సింగిలో వీటిని నిర్మించాల్సి ఉంది. కానీ ఎక్కడా ఎస్టీపీలను నిర్మించకముందే సుందరీకరణ పనులు చేపట్టేందుకు ఏర్పా ట్లు చేస్తున్నది.
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 20 కిలోమీటర్లు మూసీ సుందరీకరణ ఫేజ్-1 పనులు చేపట్టనున్నారు. కానీ ఇప్పటి వరకు 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడెక్కడ ఎస్టీపీలు నిర్మించాలో ప్రతిపాదనలు కూడా చేయలేదు. నిబంధనల ప్రకారం మూసీ పొడవునా ఎస్టీపీలను నిర్మించి నీటిని శుద్ధి చేయాలి. దాంతో పాటు గోదావరి జలాలను తరలిస్తే మూసీ మురుగు తగ్గిపోతుంది. ఆ తర్వాత సుందరీకరణ పనులుచేపట్టాలి. కానీ ప్రక్షాళన చేయకుండానే సుందరీకరణ పనులకు సిద్ధమవుతుండటంతో భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టినట్లు స్పష్టమవుతున్నది.