ఎల్‌నినోకు తోడు సర్కారు నిర్లక్ష్యం.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కరువు కోరల్లోకి నెడుతున్నది. ఇతర జిల్లాలకు భిన్నంగా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకొని, ముందుగా ఇక్కడి ప్రాజెక్టులు చెరువులు నింపుకొనే అవకాశమున్నా.. ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నది. ఫలితంగా భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. రోజురోజుకూ మరింత లోతుకు వెళ్తుండగా.. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకటి రెండు కాదు, పద్దెనిమిది ప్రాంతాల్లో ఎన్నడూ లేనివిధంగా పది మీటర్లలోతుకుపైగా భూగర్భ జలాలు పడిపోయాయాయి. దీనిని చూస్తే ముప్పు ఏ మేరకు పొంచి ఉన్నదో తెలుస్తున్నది. ప్రాజెక్టులు డెడ్ స్టోరీజీకి చేరుకోగా, చెరువులు, కుంటలు నెర్రెలు బారి చుక్కనీరు అందని దుస్థితి ఉన్నది. దీంతో సాగుపై ఇప్పటికే ఆశలు సన్నగిల్లగా.. తాగునీటికీ తంటాలు పడే ప్రమాదం కనిపిస్తున్నది.
కరీంనగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాటి సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ భూగర్భజలాలు పాతాళానికి చేరుతున్నాయి. ఇప్పటికే 18 ప్రాంతాల్లో 10 మీటర్లకుపైగా పడిపోయాయంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. అందులో అత్యధికంగా వేములవాడ అర్బన్‌లో ఎన్నడూ లేనివిధంగా 21.38 మీటర్ల లోతుకు.. అది కూడా జూలైలోనే పడిపోవడం ప్రమాద తీవ్రతను తెలుపుతున్నది. వీర్నపల్లి మండలంలోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెజార్టీ మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఇటు గంగాధరలోనూ దారుణంగా ఉన్నది. మరో పదిహేను, నెల రోజుల్లో మిగతా జిల్లాలోని మెజార్టీ మండలాల్లో ఇలాంటి ముప్పే కనిపించవచ్చని భూగర్భజలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజానికి గత పరిస్థితులు చూస్తే.. జూలైలో భూగర్భజలాలు పెరగాలి. కానీ, ఈసారి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నది.
ఎత్తిపోతలపై సర్కారు నిర్లక్ష్యం
ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని ప్రపంచ వాతావరణ శాఖ (డబ్ల్యూఎంవో) ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నివేదిక ప్రకారం చూస్తే.. 11 జూన్ నుంచి ప్రారంభమయ్యే ఎల్‌నినో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వేగంగా బలపడే ముప్పు ఉన్నదని, దీని వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, సమతుల్యం లేకుండా వర్షాలు పడడం, వేడితరంగాల తీవ్రత పెరగడం, కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో అతివృష్టి పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంటుందని ప్రపంచ నిపుణులు చెప్పిన విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకొని, కరువు ఛాయలు రాకుండా చూసుకోవాల్సిన కాంగ్రెస్ సర్కారు అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నది. నిజానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశమున్నది.
ఇక్కడి నుంచి ఎత్తిపోసే ప్రతి నీటి చుక్క ముందుగా ఉమ్మడి జిల్లాకే చేరుతుంది. కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి జలాశయం వరకు, అక్కడి నుంచి మధ్యమానేరు వరకు ఎత్తిపోయవచ్చు. అలాగే ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు వరదకాలువ ద్వారా ఎత్తిపోసుకోవచ్చు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోకుండా.. ప్రాణహిత-గోదావరిలో వస్తున్న నీటిని కన్నెపల్లి నుంచి తరలించవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే రిటైర్డ్ ఇంజినీర్లు, సాగునీటి రంగ నిపుణులు చెప్పినా.. సర్కారు మొండికి పోతున్నది.
నిజానికి ఏమాత్రం నీటిని ఎత్తిపోసినా.. అవి ముందుగా ఉమ్మడి జిల్లాకే చెందుతాయి. అలా చేస్తే భూగర్భజలాలు పడిపోకుండా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. కానీ, సర్కారు ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల అడుగంటుతున్నాయి. ఎల్‌నినో సాకు చూపుతూ దాటవేసే ప్రయత్నం చేయడమే తప్పా అందుబాటులో ఉన్న జలాల తరలింపుపై శ్రద్ధచూపడం లేదు. దీంతో పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చే ముప్పు ఉన్నది.

ఏం చేయాలి?
భూగర్భజలాలు మరింత పడిపోకముందే.. సర్కారు చర్యలకు పూనుకోవచ్చని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనికి ఉన్న ఏకైక మార్గం కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడమే. సాగుకు నీళ్లివ్వలేని పరిస్థితి ఉంటే.. కనీసం తాగునీటితోపాటు భూగర్భజలాలు పాతాళంలోకి పడిపోకుండా ఉండేందుకు కావాల్సిన మేరకైనా నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్ వస్తున్నది. ఒకసారి నీటిని ఎత్తిపోస్తే.. వరద కాలువను 122 కిలోమీటర్ల మేర నింపడానికి ఆస్కారం ఉంటుంది.
అలాగే మధ్యమానేరుకు నీటిని తరలిస్తే అక్కడి నుంచి లోయర్‌మానేరు డ్యాంకు, అక్కడి నుంచి మల్కాపూర్, అన్నపూర్ణ రిజర్వాయర్లకు నీరు పంపింగ్ చేసే అవకాశముంది. వీటి ద్వారా సుమారు 822 గొలుసుకట్టు చెరువులు నింపుకునే వీలు కలుగుతుంది. ఇలా నింపితే.. అడుగంటిన పాతాళ గంగ మళ్లీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, సర్కారు మొండి వైఖరితో ముందుకెళ్తే మాత్రం.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా మళ్లీ కరువులోకి నెట్టబడి.. ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపే ముప్పు ఉంటుంది.
