రంగారెడ్డి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి డీఎంహెచ్‌వో(జిల్లా వైద్యారోగ్యశాఖ)లో విభేదాలు రచ్చకెక్కాయి. డీఎంహెచ్‌వో స్వర్ణకుమారికి, కిందిస్థాయి సిబ్బందికి మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నది. డీఎంహెచ్‌వో ఏకపక్షంగా వ్యవహరిస్తూ సిబ్బందిని వేధిస్తున్నారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన డిప్యూటీ డీఎంహెచ్వోలు, పీహెచ్సీ వైద్యులు, వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న వివిధ స్థాయి సిబ్బంది మూకుమ్మడిగా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి డీఎంహెచ్‌వోపై ఫిర్యాదు చేశారు.
స్వర్ణకుమారి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యాలయ పరిపాలనలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫైళ్లపై సంతకాలు చేయకుండా వేధిస్తున్నారని.. సిబ్బందితో ఆమె వ్యవహరించే తీరుతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని.. కొందరు రాజీనామాలు కూడా చేస్తున్నారని.. మరికొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే నందిగామ పీహెచ్సీ వైద్యురాలు రిజైన్ చేయగా.. దండుమైలారం పీహెచ్సీ వైద్యురాలు సెలవుపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా డీఎంహెచ్‌వో అనుమతించలేదన్నారు. బస్తీ దవాఖాన సిబ్బందికి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో తీరుతో వైద్యరంగం అస్తవ్యస్తంగా మారిందని వెంటనే ఆమెను బదిలీ చేయాలన్నారు.

నివేదిక కోరిన మంత్రి..
రంగారెడ్డి డీఎంహెచ్‌వోపై సిబ్బంది ఫిర్యాదు చేయగా స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫోన్‌చేసి సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. ప్రజారోగ్య సేవలకు అంతరాయం కలిగించే అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, వాస్తవాలను నిర్ధారించి దగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి జిల్లాలో వైద్యసేవలు సజావుగా అందేలా చర్యలను తీసుకోవాలని వారు మంత్రిని కోరారు.
అస్తవ్యస్తంగా వైద్యసేవలు..
జిల్లా వైద్యారోగ్యశాఖలో కొనసాగుతున్న కోల్డ్‌వార్‌తో వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి. ఇప్పటికే జిల్లాలో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతోపాటు మరికొందరు వైద్యులు సెలవుల్లో వెళ్తుండడంతో గ్రామీణ ప్రజలకు సరైన వైద్యసేవలు అందటం లేదన్న ఆరోపణలున్నాయి. పలు పీహెచ్‌సీల్లో డాక్టర్లు లేక కిందిస్థాయి సిబ్బంది వైద్యం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే నందిగామ పీహెచ్సీ డాక్టర్ రాజీనామా చేయటంతో అక్కడ డాక్టర్ అందుబాటులో ఉండటంలేదు. అలాగే, అనేక బస్తీ దవాఖానల్లోనూ డాక్టర్లు లేక వైద్యసేవలు అస్తవ్యస్తంగా మారాయి.
విధుల నిర్వహణలో కఠినంగా ఉండటంతోనే..
బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని, విధుల నిర్వహణలో కఠినంగా ఉండటంతోనే తనపై కిందిస్థాయి సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారని రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి వెల్లడించారు.
– స్వర్ణకుమారి, రంగారెడ్డి డీఎంహెచ్‌వో