నిర్మల్, జూలై 20(నమస్తే తెలంగాణ) : నిర్మ ల్ జిల్లా రైతాంగానికి కొంత మేర ఊరట లభించింది. నిన్న, మొన్నటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందిన అన్నదాతల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తు న్న ముసురు కొత్త ఆశలను చిగురింపజేస్తున్న ది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉద యం వరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 13.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదవడంతో.. ఇప్పటికే విత్తిన పత్తి, సోయాబీన్ పం టలకు ప్రాణం పోసినట్లయింది. పత్తి, సోయాతోపాటు మొక్కజొన్న, ఇతర ఆరుతడి పంటలకు ఈ వానలు మేలు చేశాయని చెబుతున్నా రు.
గత నెల మొదటి వారంలో కురిసిన వర్షా ల కారణంగా నిర్మల్ జిల్లాలో పత్తి, సోయా పంటలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. తొలకరి వర్షాలను చూసి ఆయా పంటలను ఎప్పటి కంటే కాస్త ముందుగానే సాగు చేసిన రైతన్నపై వరుణ దేవుడు కరుణించకపోవడం తో తీవ్ర ఆందోళన చెందారు. మొదట్లో మూ డు రోజులపాటు కురిసిన వానలు.. ఆ తర్వా త ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన తీవ్రమైంది. మూడు రోజుల క్రితం వరకు చినుకు జాడ లేకపోవడంతో అప్పటికే వేసిన పత్తి, సోయా విత్తనాలు మొలకెత్తక భూమిలో నే మగ్గిపోయాయి.
దిలావర్పూర్, కుంటాల, భైంసా, లోకేశ్వరం, కుభీర్, తానూర్, ముథోల్ మండలాల్లోని చాలా మంది రైతులు మరోసారి విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్లతో దున్ని భూమిని సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతులకు కొంతమేర ఊరటనిచ్చాయి. ఈ వర్షంతో పత్తి, సోయా విత్తనాలు పునరుజ్జీవం పోసుకోనున్నాయి. ఇప్పటికే మొలకెత్తి బలహీనంగా ఉన్న మొక్కలు ఎదిగేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు.
విత్తనాలు అసలే మొలకెత్తని చేలల్లో కొత్తగా రెండోసారి విత్తనాలు వేసుకునేందుకు ఈ వర్షాలు దోహదం చేస్తాయని అంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉంటే జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రధాన ప్రాజెక్టులతోపాటు దాదాపు అన్ని చెరువుల్లోని నీటి మట్టాలు అడుగంటిపోవడంతో ఈసారి వరిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాపై సూపర్ ఎల్‌నినో ప్రభావం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగుపై రైతులకు వ్యవసాయ అధికారులు సూచనలు చేస్తున్నారు.

పెంబి మండలంలో అత్యధిక వర్షపాతం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో ఇప్పటి వరకు 251.1 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అయితే గతేడాది ఇదే సమయానికి జిల్లాలో సగటు వర్షపాతం 354.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, ప్రస్తుతం ఇంకా 29.1 మి.మీ. లోటుగానే ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్లో అత్యధికంగా పెంబి మండలంలో 377.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కుభీర్‌లో 205.3 మి.మీ, తానూర్‌లో 232.2 మి.మీ, బాసరలో 202.3 మి.మీ, ముథోల్‌లో 260.3 మి.మీ, భైంసాలో 284.4 మి.మీ, కుంటాలలో 309.6 మి.మీ, నర్సాపూర్(జి)లో 226.8 మి.మీ, లోకేశ్వరంలో 272.9 మి.మీ, దిలావర్పూర్లో 238 మి.మీ, సారంగాపూర్‌లో 247.6 మి.మీ, నిర్మల్ రూరల్‌లో 199.2 మి.మీ, నిర్మల్ అర్బన్ మండలంలో 309.2 మి.మీ, సోన్ మండలంలో 205.1మి.మీ. వర్షపాతం నమోదైంది.
అలాగే లక్ష్మణచాందలో 202.5 మి.మీ, మామడలో 216.2 మి.మీ, ఖానాపూర్‌లో 224.7 మి.మీ, కడెంలో 301 మి.మీ, దస్తూరాబాద్లో 256.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 13.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కడెం మండలంలో 30 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా కుభీర్ మండలంలో ఒక మిల్లీ మీటరు వర్షపాతం నమోదైంది.

4.30 లక్షల ఎకరాల్లో సాగు
ఈ వానకాలంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో సోయా, పత్తి పెద్ద మొత్తంలో సాగవుతాయని వ్యవసాయశాఖ రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్నది. ఇందుకు అనుగుణంగా ఇప్పటి వరకు 1.50 లక్షల ఎకరాల్లో పత్తి, 1.20 లక్షల ఎకరాల్లో సోయా పంటలను రైతులు సాగు చేశా రు. మరో 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైం ది. గత నెల రోజులుగా వర్షాలు లేక చాలా చోట్ల పత్తి, సోయా ఎండిపోయే దశలో ఉండగా, తాజా వర్షాలు ఈ రెండు పంటలకు ప్రాణం పోశాయని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు, చెరువుల్లోకి కొత్త నీరు చేరలేదు. దీంతో సాధారణంగా ఏ టా వానకాలంలో సాగయ్యే 1.40 లక్షల ఎకరాల వరి ఈసారి ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటికే చాలా చోట్ల రైతులు నార్లు వేసుకొని భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేవలం బోరు బావుల కింద మాత్రమే అక్కడక్కడ నాట్లు పడ్డాయి. ఎల్‌నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రాబోయే రోజుల్లో 50 శాతం కంటే తక్కువగా లో టు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. వరి సాగు చేసేందుకు అవసరమైన నీటి లభ్యత లేని కారణంగా రైతులు ఈసారి వరి చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు. ఈసారి వరిని పక్కన బెట్టి మార్కెట్లో డిమాండ్ ఉన్న కంది, కూరగాయలతోపాటు, ఆయిల్‌పాం తోటల సాగుకు మొగ్గు చూపాలని కోరుతున్నారు.