బాలానగర్, నవంబర్ 17 : పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు ఖాయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని మోతీఘణపూర్, గుండేడ్, నేరాళ్లపల్లి, ఉటుకుంటతండా, వాయిల్కుంటతండా, జీడిగుట్టతండా, జాలుగడ్డతండాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాయమాటలతో మభ్యపెట్టడానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు.
కాంగ్రెసోళ్లు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేయాలని చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ సంపూర్ణ మద్దతు ఇస్తామని పలు గ్రామాల, తండాల ప్రజలు తెలిపారు. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. అనంతరం వివిధ గ్రామాలు, తండాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.