aహైదరాబాద్,మార్చి 17 నమస్తే తెలంగాణ: విశాఖ ఇండస్ట్రీస్, హెచ్‌సీఏకు మధ్య ఎలాంటి అధికారిక ఒప్పందం కుదరకముందే హెచ్‌సీఏ విశాఖకు రూ.2.32 కోట్లు చెల్లించిందని టీసీఏ ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి ఆరోపించారు. రెండు సంస్థల మధ్య 2004 అక్టోబర్16న అధికారిక ఒప్పం దం కుదిరిందని, కానీ 2004 మార్చి మాసం నుంచి విశాఖ కంపెనీకి చెల్లింపులు జరిగాయని, ఇది ఎట్లా సాధ్యం అయిందని ఆయన ప్రశ్నించారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కుంభకోణానికి మూల కారణంగా భావిస్తున్న హెచ్‌సీఏ-విశాఖ సంస్థ మధ్య ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలను మీడియాకు విడుదల చేశారు.
గత దశాబ్ద కాలంగా హెచ్‌సీఏలో దాదాపు రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు.హెచ్‌సీఏ, విశాఖ సంస్థ మధ్య జరిగిన ఒప్పందం బోఫోర్స్ కుంభకోణానికి ఏమాత్రం తక్కువ కాదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. గత దశాబ్ద కాలంలో హెచ్‌సీఏ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో హెచ్‌సీఏ ఘోరంగా విఫలమైందని, ఇది కేవలం ఒక ఒప్పందానికి సంబంధించిది కానే కాదని, అనేక విషయాల్లో పారదర్శకత పూర్తిగా లోపించి, జవాబుదారీతనం పక్కదారి పట్టిందని ఆయన ఆరోపించారు.
హెచ్‌సీఏలో గత దశాబ్ద కాలంలో రూ.600 కోట్లకు మించి కుంభకోణం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. ఎలాంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించకుండా ఉప్పల్‌లో స్టేడియం నిర్మాణం జరిగిందని, స్టేడియానికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఒప్పందంలో తీవ్ర ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయని, ప్రాపర్టీ టాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ టాక్స్ ఎగవేత ద్వారా కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. దీనికి తోడు వెండర్ పేమెంట్స్, సిబ్బంది జీతభత్యాలు, పవర్ బిల్స్, మాజీ క్రికెటర్లకు పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవడం లాంటి అనేక ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఆర్థిక వ్యవహారాలతో పాటు జట్ల ఎంపిక విషయంలోనూ ముడుపులు చేతులు మారినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గురువారెడ్డి ఆరోపించారు.
హెచ్‌సీఏ-విశాఖ ఒప్పందాలకు సంబంధించిన అధికార సమాచారం హెచ్‌సీఏ అధికారిక వెబ్సైట్లో సరిగా లేదని, ఉద్దేశపూర్వకంగానే వెబ్సైట్లో సమాచారం పెట్టలేదని గురువారెడ్డి అన్నారు. వెబ్సైట్ సమాచారంలోనే లోపాలు ఉండటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆని ఆయన అన్నారు. వాస్తవానికి హెచ్‌సీఏ, విశాఖ మధ్య ఒప్పందం అక్టోబర్ 16, 2004తేదీన జరిగింది. కానీ విశాఖకు అదే ఏడాది మార్చి నుంచే చెల్లింపులు మొదలయ్యాయి. ఒప్పందానికి సంబంధించి అసోసియేషన్‌లో ఎలాంటి అనుమతులు, మీటింగ్ మినిట్స్, రికార్డులు లేవని, ముఖ్యంగా రాజీవ్‌గాంధీ స్టేడియం పేరు మార్పు విషయంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఇన్నేండ్ల హెచ్‌సీఏ వ్యవహారంపై సీబీఐ సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.