గద్వాల ,జూన్ 2 : నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తీరు కంచె చేను మేసిన వైనంలా ఉందని నడిగడ్డ కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.
అనంతరం ఎంపీ మల్లు రవి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడును వెంట బెట్టుకొని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య ఆహ్వానం మేరకు తేనీటి విందుకు వెళ్లారని, కాంగ్రెస్ పార్టీ నాయకులను విస్మరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కారులో ఎక్కించుకొని కాంగ్రెస్ నాయకులను పట్టించుకోకుండా వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎంపీ ఆయనే క్రమ శిక్షణ తప్పడం ఏంటని ప్రశ్నించారు.
ఎంపీ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను ప్రోత్సహిస్తున్నారని, కొంత మంది కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను పదిశాతం కమీషన్ తీసుకుని మంజూరు చేయిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఆరోపించారు. పార్టీలో క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తే క్రమశిక్షణ తప్పడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎంపీ అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయ దర్శనం కోసం వెళ్లినా ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఉండకపోవడం విశేషం.