బిజినేపల్లి, డిసెంబర్ 23 : మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు సబ్సిడీపై వచ్చిన స్ప్రింక్లర్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. స్థా నిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి సబ్సిడీపై వచ్చిన స్ప్రింక్లర్లను సోమవారం కొందరు రైతులకు అందజేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత గ్రామ, మం డల కాంగ్రెస్ నాయకులు స్ప్రింక్లర్ల విషయంలో దూషించుకున్నారు. పార్టీ గెలుపుకోసం కృషి చేసిన గ్రామ స్థా యి కార్యకర్తలకు చెప్పకుండా ఇష్టానుసారంగా స్ప్రింక్లర్లను మంజూరు చేయడమేమిటని మండల స్థాయి కార్యకర్తలను నిలదీశారు.
గ్రామంలోని కీలక నేతలకు తెలియకుండానే పేర్లను పిలిచి ఇష్టానుసారంగా ఎలా అందజేస్తారన్నారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకున్నది. పెద్ద గ్రామాలకు సైతం స్ప్రింక్లర్లు రాకపోవడం, వచ్చినా గ్రామానికి ఒకటి, రెండు రావడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అక్కడికి వచ్చిన రైతులు అసహనం వ్యక్తం చేశారు.
స్ప్రింక్లర్ల విషయంలో మండల, గ్రామస్థాయి కార్యకర్తలే స్వయంగా ఒకరిపై ఒకరు దూషణలకు దిగడాన్ని చూసి వారు ముక్కున వేలేసుకున్నారు. ఇంతలోనే గుడ్లనర్వ గ్రామానికి చెందిన రైతులకు రెండు సెట్ల స్ప్రింక్లర్లు గతంలో ఇవ్వాల్సి ఉన్నది. సోమవారం కూడా వారికి ఇవ్వకపోవడంతో వారు వేదిక వద్దే నిరీక్షించారు. తమకు అందించే వరకు వెళ్లమని భీష్టించుకూర్చోవడంతో స్పందించిన అధికారులు ఇతర ప్రాంతాల నుంచి రెండు సెట్లను తెప్పించి సదరు రైతులకు అందించడంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు.