మాగనూరు, నవంబర్ 14 : మా పొలాల్లో అడ్డగోలుగా ఇసుకను తవ్వి పంటలు పండకుండా పడావు చేస్తారా అంటూ కాంగ్రెస్ నాయకుడు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపిన ఘటన మాగనూరులో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉ న్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో రాఘవ కన్స్ట్రక్షన్ మాగనూరులోని పెద్దవాగు నుంచి శుక్రవారం అక్రమ ఇసుకను తరలిస్తుండగా, మా జీ సర్పంచ్ పులావతి తనయుడు, కాంగ్రెస్ నాయకుడు వాకిటి శ్రీను పురుగు మందు డబ్బాతో వాగులో నిరసన వ్యక్తం చేశారు.
ఇసుక తరలిస్తున్న స్థలంలో మా పొలం ఉందని, ఇసుక తరలింపు ఇలాగే కొనసాగితే పంటల కోసం వేసుకున్న బోర్లకు సాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని వాపోయారు. మా పొలం సమీపంలో ఇసుక తరలించవద్దని పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్, ఆర్డీవో, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాకిటి శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.
రాఘవ కన్స్ట్రక్షన్కు తరలిస్తున్న ఇసుకకు ఎలాంటి అనుమతి లేదని, ఇప్పటి వరకు తరలించిన ఇసుక వివరాలు అడిగితే కూడా చెప్పడం లేదన్నా రు. అధికారుల అండతోనే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఇసుక తరలిస్తే పురుగుల మందు తాగి చస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు, పోలీసులు పెద్ద వాగు వద్దకు చేరుకొని వాకిటి శ్రీనును సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందుకు ససేమిరా అనడంతో చేసేది లేక ఖాళీ టిప్పర్లను వాగు నుంచి పంపించారు.