గద్వాల, అక్టోబర్ 5 : స్థానిక ఎన్నికలు సమీస్తున్న వేళ గద్వాల కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్లు, ఎన్నికల తేదీల ను ప్రకటిండంతో అభ్యర్థుల వేటలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ నుంచి అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి ఇబ్బందులు లేకున్నా, కాంగ్రెస్‌లో మాత్రం వర్గపోరు కారణంగా అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. గత రెండు రోజులుగా ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమై ఉండగా, ఆయన దీటుగా సరిత తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఇలా కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు వేరువేరుగా సమావేశాలు నిర్వహించడంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. జెడ్పీటీసీలకు సంబంధించి అధిష్టానం మూడు పేర్లు ప్రతిపాదించాలని ఆదేశించడంతో గద్వాల కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే జాబితాను అధిష్టానం ముందుంచినట్లు తెలుస్తుంది.
దీంతో గద్వాలలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అయితే అధిష్టానం అసలైనా కాంగ్రెస్ నేతల వైపు మొగ్గు చూపుతుందా? లేక వలస నేతల వైపు మొగ్గు చూపుతుందా? అనేది కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు. ఎవరికి వారే సమావేశాలు నిర్వహిస్తుండడంతో కార్యకర్తలు ఎటుపోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
బీ-ఫామ్స్ పంచాయితీ..
ప్రస్తుతం జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతుండడంతో అధిష్టానం బీ-ఫామ్స్ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేకు ఇస్తుందా లేక అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచి ఓడిపోయిన సరితకు ఇస్తుందా అనేది సందిగ్ధత నెలకొన్నది. అయితే ఎవరికి వారే సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో కార్యకర్తలు ఆందోళన చెందకుండా, పార్టీ వీడకుండా ఉండేందుకు తమ అనుచరుల ద్వారా బీ-ఫామ్స్ మనకు వస్తాయంటే, మనకే వస్తాయంటూ ఇటు ఎమ్మెల్యే, అటు సరిత వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నాడని అలాంటప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేకు ఎందుకు బీ-ఫామ్స్ ఇస్తుందని సరిత వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అయితే బీ-ఫామ్స్ విషయంలో అధిష్టానం ఎమ్మెల్యే వైపు మొగ్గు చూపుతుందా లేక సరిత వైపు మొగ్గు చూపుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఒక వేళ అధిష్టానం ఎమ్మెల్యేకు బీ-ఫామ్స్ ఇస్తే సరిత వర్గం వారికి మద్దతు ఇస్తుందా? అనేది అనుమానమే.
అధిష్టానం సరిత వర్గానికి బీ-ఫామ్స్ ఇస్తే ఎమ్మెల్యే వర్గీయులు కూడా మద్దతు ఇవ్వడం అనుమానమే అన్నట్లు తెలుస్తుంది. దీంతో బీ-ఫామ్స్ ఎవరికి ఇవ్వాలో అర్థం కాక అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అనే రీతిలో గద్వాల కాంగ్రెస్ పరిస్థితి ఉన్నది. అధిష్టానం ఇటు సరిత వర్గీయులను బుజ్జగించలేక అటు ఎమ్మెల్యే వర్గీయులకు ఏం చెప్పాలో తెలియక సతమత మవుతున్నట్లు తెలుస్తున్నది. అధిష్టానం ఏ వర్గానికి బీ-ఫామ్స్ ఇచ్చినా మరో వర్గం ఇండిపెండెట్లుగా స్థానిక సంస్థల బరిలో దించడానికి ఎవరికి వారే సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్కు కలిసొచ్చే అవకాశం..
గద్వాల కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండడంతో ఇది బీఆర్ఎస్కు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద సవాలే. ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు గద్వాల కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య ఉన్న వర్గ విభేదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఇది బీఆర్ఎస్కు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది.
గత నెల 13న గద్వాల గర్జనకు కేటీఆర్ హాజరై కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపారు. అదే జోష్‌లో ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని బాకీ కార్డులను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. దీనికి తో డు కాంగ్రెస్‌లో వర్గ పోరు బీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది.