వనపర్తి : రైతులకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Singireddy Niranjan Reddy ) అన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలసి జిల్లాలోని పెద్దమందడి మండలంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమవడం రేవంత్ రెడ్డి చేతగానితనం, నిర్లక్ష్యమేనని ఆరోపించారు. రైతులకు ఉద్దేశపూర్వకంగానే సకాలంలో యూరియా ఇవ్వకుండా, కరెంట్ సరఫరాలో కోతలు పెడుతూ, కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు విసిగిపోయి తమ ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటే, ప్రభుత్వంపై భారం పడకుండా ఉంటుందని రేవంత్ కుట్ర చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నాడు కేసీఆర్ పంట చేతికి రాగానే వెంటనే ధాన్యం కొనుగోలు చేసి, వారం రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. నేడు రేవంత్ తుగ్లక్ పాలనలో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని దుయ్యబట్టారు.